ప్రభుత్వానికి విలువల్లేకుండా పోయాయి...

1 Jul, 2015 15:22 IST|Sakshi
ప్రభుత్వానికి విలువల్లేకుండా పోయాయి...

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ మాజీ కార్యదర్శి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త కేఎన్ గోవిందాచార్య ఎన్డీయే ప్రభుత్వంపై మరోసారి తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతిపరులైన మంత్రులను వెనకేసుకు రావడం ద్వారా విలువలకు తిలోదకాలు ఇచ్చేసిందని  మండిపడ్డారు. అధికార వ్యామోహం తప్ప ప్రజల మీద మమకారం లేదని వ్యాఖ్యానించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

వసుంధర రాజేపై వేటువేస్తే పార్టీకి నష్టం కలుగుతుందనే వాదనలను ఆయన ఖండించారు. ఇలాంటి క్లిష్టసమయాల్లో పార్టీని తన భుజస్కంధాలపై  మోసుకొని నడిపించాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందని అభిప్రాయపడ్డారు. మరింత విజ్ఞతతో వ్యవహరించి వ్యక్తిగత గౌరవాన్ని, పార్టీ ప్రతిష్ఠను కాపాడాలని మోదీని కోరారు.

ఈ సందర్భంగా  బీజేపీ - ఆర్ఎస్ఎస్ సాన్నిహిత్యంపై మాట్లాడుతూ  మోదీ ప్రభుత్వం పాలనపై ఆర్ఎస్ఎస్ విశ్వాసం మరింత క్షీణించిందని ఆయన పేర్కొన్నారు. బీహార్లో ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడాన్ని గోవిందాచార్య తప్పుబట్టారు.

మరిన్ని వార్తలు