'సౌదీలో భారతీయుల కష్టాలు తీరుస్తాం'

1 Aug, 2016 13:05 IST|Sakshi
'సౌదీలో భారతీయుల కష్టాలు తీరుస్తాం'

న్యూఢిల్లీ/జెడ్డా: సౌదీ అరేబియా జెడ్డా నగరంలో ఆకలితో అలమటిస్తున్న భారతీయులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నామని సోమవారం రాజ్యసభలో చెప్పారు. దీని గురించి తెలిసిన వెంటనే జెడ్డా కాన్సులేట్ జనరల్, రియాద్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడానని చెప్పారు. ఆకలితో అలమటిస్తున్న భారతీయులకు పది రోజులకు సరిపడా సరుకులు ఉచితంగా అందించేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. సహాయ మంత్రి వీకే సీంగ్ సౌదీకి ప్రయాణమవుతున్నారని చెప్పారు. అక్కడ కష్టాలు పడుతున్న భారతీయులు వివరాలు సేకరిస్తామని, వారి సమస్యలను పరిష్కరిస్తామని సుష్మా స్వరాజ్ హామీయిచ్చారు.

మరోవైపు ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జెడ్డా నగరంలో ఆకలితో అలమటిస్తున్న భారతీయులకు అక్కడి భారత దౌత్య కార్యాలయం భోజన వసతి ఏర్పాటు చేస్తోంది. షుమైసి, సిస్టెన్/మక్రొనా, సొజెక్స్, హైవే, టైఫ్‌లోని శిబిరాల్లో ఆహారం సరఫరా చేస్తున్నారని ఆదివారం ట్వీట్ చేసింది. సౌదీ అరేబియా, కువైట్ దేశాల్లో చమురు, ఇతర కంపెనీలు నష్టాల బాట పట్టడంతో ఉద్యోగులను తీసేయడం, జీతాలివ్వకుండా కంపెనీలు మూసేయడం తీవ్రమైంది. దీంతో సౌదీ, కువైట్‌లోని 10 వేల మంది భారతీయులు మూడు రోజులుగా తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరిన్ని వార్తలు