గ్యాస్‌ మంట

13 Feb, 2020 03:21 IST|Sakshi

ఒక్క సిలిండర్‌పై రూ.144.5 పెంపు

భగ్గుమన్న విపక్షాలు

న్యూఢిల్లీ: వంటగ్యాస్‌ ఎల్పీజీ ధర అమాంతం పెరిగింది. సిలిండర్‌పై ఒక్కసారిగా రూ.144.5 పెంచుతూ కేంద్రం అసాధారణ నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీలో రూ.714గా ఉన్న సిలిండర్‌ ధర రూ.858.50కి చేరుకుంది. 2014 జనవరి తర్వాత వంటగ్యాస్‌ ధర ఇంత భారీస్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదలే ఇందుకు కారణమని సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌కు ఇచ్చే సబ్సిడీని పెంచడం కొంతవరకు ఊరటనిచ్చింది. ఇంతకు ముందు రూ.153.86 రాయితీ ఇవ్వగా దాన్ని రూ.291.48కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన్‌ మంత్రి ఉజ్వల యోజన (పీఎమ్‌యూవై) లబ్ధిదారులకు సబ్సిడీని రూ.174.86 నుంచి రూ.312.48కు పెంచింది.

సాధారణంగా ప్రతినెలా ఒకటో తారీఖున ధరలను సమీక్షిస్తుంటారు. అయితే ఈసారి రాయితీని భారీగా పెంచడంతో అనుమతుల ప్రక్రియలో జాప్యంతో రెండు వారాలు ఆలస్యమైందని అధికారులు తెలిపారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే వంటగ్యాస్‌ ధర పెంచడం గమనార్హం. కాగా, ఈ పెంపుపై విపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. వంటగ్యాస్‌ ధరను పెంచుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల జేబులకు చిల్లు పెట్టేలా ఉందని కాంగ్రెస్‌ పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతోనే కేంద్రం వంటగ్యాస్‌ ధరను పెంచిందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌ ధరను పెంచడం పేద ప్రజలపై తీసుకున్న ‘క్రూరమైన చర్య’అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అభివర్ణించారు.
 

మరిన్ని వార్తలు