‘ఆర్థికం’పై సమగ్రంగా చర్చిద్దాం

31 Jan, 2020 06:27 IST|Sakshi
అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ప్రధాని మోదీ, రాజ్‌నాథ్, ఆజాద్‌ తదితరులు

అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ

సీఏఏ వ్యతిరేక నిరసనలను లేవనెత్తిన విపక్షాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో విపక్ష సభ్యులు లేవనెత్తారు. నిరసనకారుల ఆందోళనలపై స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ఆర్థిక మాంద్యం సహా అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారికి స్పష్టం చేశారు.

మెజారిటీ సభ్యులు కోరుతున్న విధంగా.. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక అంశాలకు సముచిత ప్రాధాన్యత ఇద్దామని, ప్రస్తుతం ప్రపంచమంతా నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి భారత్‌ ఎలా ప్రయోజనం పొందగలదనే విషయంపై దృష్టిపెడదామని ప్రధాని సూచించారు. ‘కొత్త సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థకు సరైన దిశానిర్దేశం చేద్దాం’ అన్నారు. భేటీలో సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. ‘ప్రతీ అంశంపైనా సాదాసీదాగా చర్చించడం కాకుండా.. సమగ్రంగా నిర్మాణాత్మకంగా చర్చ జరుపుదాం’ అని ప్రధాని సూచించారు.

26 పార్టీలు పాల్గొన్న ఈ అఖిలపక్ష సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాకు తెలిపారు. సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న నిరుద్యోగం.. తదితర అంశాలను ఈ భేటీలో విపక్షాలు లేవనెత్తాయి. జమ్మూకశ్మీర్‌లో మాజీ సీఎంలు, ఇతర రాజకీయ నేతలను నిర్బంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించామని భేటీ అనంతరం కాంగ్రెస్‌ సభ్యుడు  ఆజాద్‌ తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు వీలుగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లాను విడుదల చేయాలని డిమాండ్‌ చేశామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరామని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ తెలిపారు.

అంతా సహకరిస్తామన్నారు: స్పీకర్‌
బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని అన్ని పార్టీల నేతలు తనకు హామీ ఇచ్చారన్నారు. సభలో మాట్లాడేందుకు అన్ని పార్టీల సభ్యులకు తగిన సమయమిస్తానన్నారు.   
 

మరిన్ని వార్తలు