క‌రోనా ఉంద‌ని ఆస్పత్రిలో చేర్పిస్తే.. శ్మ‌శానానికి పంపారు

14 May, 2020 08:59 IST|Sakshi

కోల్‌క‌తా : కరోనా మహమ్మారి బారిన పడిన వ్యక్తి మరణం గురించి కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించకుండా అంత్యక్రియలు పూర్తిచేసిందో ప్రభుత్వాసుస్పత్రి. బాధితుడి చనిపోయిన నాలుగు రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. న‌గ‌రానికి చెందిన 70 ఏళ్ల హ‌రినాథ్ సేన్ అనే వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆయ‌న‌ను ప్ర‌భుత్వ‌ ఆసుపత్రికి త‌ర‌లించారు. మిగ‌తా కుటుంబ‌ స‌భ్యులంద‌రినీ క్వారంటైన్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. అయితే హ‌రినాధ్ సేన్ ఆరోగ్యం గురించి ఆస్పత్రికి కాల్ చేస్తే.. సిబ్బంది చాలా దురుసుగా మాట్లాడార‌ని కొడుకు అర్జిత్ సేన్ ఆరోపించారు. ‘మీ తండ్రి మ‌ర‌ణించాడు, ద‌హ‌న సంస్కారాలు కూడా చేశాం అని నాలుగు రోజుల‌ తర్వాత ఆస్పత్రి నుంచి ఫోన్ రాగానే మేమంతా షాక్‌కి గుర‌య్యామ’ని అర్జిత్ సేన్ మీడియాతో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇప్ప‌టివ‌ర‌కు త‌న తండ్రి డెత్ స‌ర్టిఫికెట్ కూడా అందివ్వ‌లేద‌ని తెలిపాడు. అయితే అర్జిత్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆస్పత్రి యాజ‌మాన్యం స్పందించ‌డానికి నిరాక‌రించింది. 

మరిన్ని వార్తలు