వాహనాలకు ‘నైట్రోజన్‌’ టైర్లు

9 Jul, 2019 04:08 IST|Sakshi

న్యూఢిల్లీ: టైర్ల నాణ్యతను పెంచేందుకు టైర్ల తయారీలో రబ్బర్‌తో సిలికాన్‌ కలపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ చెప్పారు. సిలికాన్‌ కలసిన రబ్బర్‌ టైర్లలో సాధారణ గాలికి బదులు నైట్రోజన్‌ వాయువు నింపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో టైర్లు పేలే అవకాశాలు తగ్గుతాయని, ఆగ్రాలో రోడ్డుప్రమాదం వంటి ఘటనలు తగ్గుతాయని గడ్కరీ అన్నారు.

నోయిడా–ఆగ్రా హైవేలో సోమవారం జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేను యూపీ ప్రభుత్వమే నిర్మించిందని దాంతో కేంద్రానికి ఏ సంబంధం లేదని అన్నారు.  పార్లమెంట్‌లో రోడ్డు భద్రత బిల్లు గత సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉందని దాన్ని ఆమోదించాలని సభ్యులను కోరారు. అది పాసైతే 30 శాతం బోగస్‌ లైసెన్స్‌లు రద్దవుతాయన్నారు. దేశంలో 25 లక్షల మంది అనుభవజ్ఞులైన డ్రైవర్ల అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలోనూ ఓ లోక్‌సభ సభ్యుడు చైర్మన్‌గా ఓ కమిటి ప్రారంభిస్తామన్నారు. ఈ కమిటీ ద్వారా రోడ్డు భద్రతా సూచనలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.

మరిన్ని వార్తలు