ఇక అధికారిక ఈ-మెయిళ్లన్నీ ‘ఎన్‌ఐసీ’ ద్వారానే...

30 Oct, 2013 03:43 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వాధికారులు ఇకపై ప్రభుత్వం నిర్వహించే ఒకే ఈ-మెయిల్ సర్వీసు ద్వారానే అధికారిక ఈ-మెయిళ్లు పంపాలి. ఇందుకుగాను నేషనల్ ఇన్‌ఫార్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ) రూపొందిస్తున్న ఈ-మెయిల్ సర్వీసు ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఈ-మెయిళ్లు పంపుకునేందుకు జీమెయిల్, యాహూ, హాట్ మెయిల్ వంటి సర్వీసులను ఉపయోగిస్తున్నారు.
 
 అయితే ఈ కంపెనీలన్నీ విదేశాలకు చెందినవి కావడం, వాటి సర్వర్లు కూడా విదేశాల్లోనే ఉన్న నేపథ్యంలో కీలక, రహస్య సమాచార చౌర్యానికి ఆస్కారం ఉండటంతో వాటిని అధికారిక మెయిళ్ల కోసం ఉపయోగించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విభాగం(డీఈఐటీవై) ఓ ముసాయిదా విధానాన్ని సిద్ధం చేసిందని, దీనిపై మంత్రుల అభిప్రాయాలను కోరుతోందని ఆ విభాగం కార్యదర్శి జె.సత్యనారాయణ వెల్లడించారు. దీని అమలుకు రూ.50-100 కోట్లు ఖర్చు కానుందన్నారు.

మరిన్ని వార్తలు