విద్యార్థుల కాళ్లు మొక్కిన ప్రొఫెసర్

28 Sep, 2018 11:23 IST|Sakshi

భోపాల్‌ : అధ్యాపక వృత్తిలో ఉంటూ పాపం చేశానంటూ విద్యార్థులను వెంబడిస్తూ వారి కాళ్లను మొక్కుతున్న ఓ ఉపాధ్యాయుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సోర్‌‌లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాలలో దినేశ్ గుప్తా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పరీక్షల ఫలితాలు జాప్యం అవుతున్నాయని ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు పవన్‌ శర్మ ఆధ్వర్యలో నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా దినేశ్‌ గుప్తా పాఠాలు చెబుతున్న తరగతి దగ్గరకి వెళ్లి స్లోగన్‌లు ఇవ్వడం ప్రారంభించారు. తన క్లాస్‌ను అడ్డుకోవద్దంటూ దినేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో భారత్‌ మాతాకీ జై, వందేమాతరం స్లోగన్‌లనే అడ్డుకుంటారా.. దినేశ్‌ గుప్తా దేశ ద్రోహి అంటూ స్లోగన్‌లు ఇవ్వడం ప్రారంభించారు. ప్రిన్సిపాల్‌ రవింద్ర సొహానీ జోక్యం చేసుకొని దినేశ్‌ గుప్తాతోపాటూ ఏబీవీపీ విద్యార్థులను సంయమనం పాటించాలని సూచించారు. ప్రొఫెసర్‌ తమకు క్షమాణ చెప్పాల్సిందేనని ఏబీవీపీ విద్యార్థులు పట్టుబట్టారు. దీనికి దినేశ్‌ గుప్తా ఒప్పుకోకపోవడంతో అతన్ని వెంబడిస్తూ దేశద్రోహి అంటూ స్లోగన్‌లు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దినేశ్‌ గుప్తా కాలేజీ క్యాంపస్‌లోనే విద్యార్థులు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకున్నారు. వెంటపడి మరీ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఏబీవీపీ ఉపాధ్యాయులను గౌరవిస్తుందని, రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాలలో చోటు చేసుకున్న ఘటన బాధాకరమని ఏబీవీపీ జాతీయ నేత అంకిత్‌ గార్గ్‌ వ్యాఖ్యానించారు. పరీక్షా ఫలితాల్లో జాప్యం కారణంగానే ఏబీవీపీ విద్యార్థులు నిరసన తెలిపారని,  దినేశ్‌ గుప్తాను దేశ ద్రోహి అని ఎవరూ అనలేదన్నారు. ఆ సమయంలో ప్రొఫెసర్‌ కోపంగా ఉన్నందును క్యాంపస్‌లో రచ్చ చేయడానికే విద్యార్థుల కాళ్లు పట్టుకున్నారని తెలిపారు.

'నిరసన పేరుతో నా తరగతికి ఏబీవీపీ విద్యార్థులు అడ్డుతగిలారు. వాళ్లు నన్ను దేశ ద్రోహి అంటూ స్లోగన్‌లు ఇచ్చారు. నన్ను క్షమాణ చెప్పాలని కోరారు. సరే, అని వాళ్ల కాళ్ల మొక్కా. ఈ క్యాంపస్‌లో గత 32 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. వారికన్నా నాకే దేశభక్తి ఎక్కువ. దేశభక్తిని ఒకరికి చూపించాల్సిన అవసరం నాకు లేదు. విద్యార్థులు బాగా చదువుకోవాలనే నేను కోరుతున్నా. చదువుకుంటేనే జీవితం బాగుంటుంది. వాళ్లపై చర్యలు తీసుకోవాలని నేను అనుకోవడం లేదు' అని దినేశ్‌ గుప్తా తెలిపారు. ఇది అంత పెద్ద సమస్య ఏమీ కాదని, ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని ప్రిన్సిపల్‌ రవింద్ర సొహానీ అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా