ఉద్యోగ విరమణ కాగానే.. చాపర్‌ ఎక్కాడు

1 Aug, 2019 11:37 IST|Sakshi

ఫరిదాబాద్‌ : ఉద్యోగ విరమణ అనంతరం ఓ వ్యక్తి చేసిన పని గ్రామస్తులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ అతను చేసిందేమీటంటే.. చాపర్‌లో ప్రయాణించాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరిదాబాద్‌ సమీపంలోని సద్పురాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురే రామ్‌ అనే వ్యక్తి నీమ్కా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో క్లాస్‌ 4 ఉద్యోగిగా పనిచేసేవాడు. అది అతని స్వగ్రామం సద్పురాకు 2 కి.మీల దూరంలో ఉంటుంది. సద్పురా నుంచే అతను పాఠశాలకు నిత్యం రాకపోకలు సాగించేవారు. అయితే 40 ఏళ్ల పాటు పాఠశాలలో పనిచేసిన రామ్‌ ఇటీవల ఉద్యోగ విరమణ పొందాడు. 

అయితే రామ్‌కు అతని కుటుంబ సభ్యులతో కలిసి చాపర్‌లో ప్రయాణించాలనే కోరిక ఉండేంది. ఈ విషయాన్ని తన రిటైర్‌మెంట్‌కు కొద్ది రోజుల మందు తన తమ్ముడు, సద్పురా సర్పంచ్‌ శివకుమార్‌కు తెలిపాడు. తన ఉద్యోగ విరమణను కొత్తగా జరుపుకోవాలని ఉన్నట్టు పేర్కొన్నాడు. దీంతో శివకుమార్‌ అన్న కోరిక తీర్చేందుకు సిద్దమయ్యాడు. అందుకోసం కుటుంబసభ్యులంతా కలిసి రూ. 3.30 లక్షలు జమ చేశారు. ఆ డబ్బుతో.. రామ్‌ పనిచేసిన పాఠశాల నుంచి సద్పురాకు 8 ట్రిప్పులు తిరిగేలా ఓ చాపర్‌ను బుక్‌ చేశారు. రామ్‌ ఉద్యోగ విరమణ కార్యక్రమం అనంతరం అతని కుటుంబ సభ్యులంతా నీమ్కా నుంచి సద్పురాకు చాపర్‌లో చేరుకున్నారు. సదుర్పాకు చాపర్‌లో వచ్చిన రామ్‌కు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. 

మరిన్ని వార్తలు