ఆమె కూతురు పెళ్లికి.. స్కూలుకు సెలవు!

20 Feb, 2016 18:19 IST|Sakshi
ఆమె కూతురు పెళ్లికి.. స్కూలుకు సెలవు!

సేలం: తన కూతురు పెళ్లి కోసం ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏకంగా పాఠశాలకు రెండు రోజులు తాళం వేయించింది. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న మూడొందల మంది విద్యార్థులతో పాటు తొమ్మిది మంది ఉపాద్యాయులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి పోవడంతో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని పుక్కుంపట్టిలో తమిళ్సెల్వి ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 17, 18 తేదీలలో చెన్నైలో తన కూతురు వివాహం జరిపించిన ఆమె.. ఆ రెండు రోజులు పాఠశాలకు సెలవు ప్రకటించింది. అదికూడా అక్కడ స్థానికంగా లేనటువంటి ఓ పండుగను గ్రామస్తులు జరుపుకుంటున్నారనే అసత్య కారణాన్ని చూపిస్తూ ఈ చర్యకు పాల్పడింది. దీనిపై ఆరాతీసిన విద్యార్థుల తల్లిదండ్రులు అసలు స్థానికంగా తాము ఆ పండుగనే జరుపుకోమని చెబుతూ.. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హెచ్ఎం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని గుర్తించిన విద్యాశాఖ అధికారులు దీనిపై పూర్తి నివేదిక అందించాలని కోరారు.
 

మరిన్ని వార్తలు