త్వరలో దిగి రానున్న పప్పుల ధరలు?

11 Jul, 2016 15:08 IST|Sakshi
త్వరలో దిగి రానున్న పప్పుల ధరలు?

న్యూడిల్లీ: ఆందోళన రేపుతున్న ప‌ప్పు ధాన్యాల కొర‌తను త‌గ్గించడానికిగాను ప్రభుత్వం ప‌లు ప్రయత్నాల‌ను మొద‌లుపెట్టింది.  ఈ కొరతను అధిగమించేందుకు దీర్ఘకాల వ్యూహంతో  ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే  వీటిని పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకటించారు.  దీంతోపాటుగా ఈ సంవత్సరం పప్పుల బఫర్ స్టాక్ పరిమాణాన్ని  రెండు మిలియన్ టన్నులకు పెంచింది.   నింగినంటుతున్న పప్పుధాన్యాల ధరలను అదుపు  చేసేందుకు చర్యలకుపక్రమించింది.  దీంతో  రాబోయే  రెండు మూడునెలల్లో పప్పుధరలు దిగొస్తాయని  యోచిస్తోంది.

మరోవైపు  మొజాంబిక్ నుండి ప‌ప్పు ధాన్యాలను దిగుమ‌తి చేసుకోవ‌డానికి వీలు క‌ల్పించే అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద ప‌త్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు చేయడం ద్వారా ఒక దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ప్రైవేటు సంస్థల నుంచి లేదా రెండు దేశాలు నామినేట్ చేసే ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి- ప్రభుత్వానికి మధ్య (జి2జి) జ‌రిగే విక్రయాల‌ ద్వారా గాని ప‌ప్పు దినుసుల‌ను దిగుమ‌తి చేసుకోవ‌డం జ‌రుగుతుంది. ఈ  దీర్ఘకాలిక జి2జి ఒప్పందాన్ని కుదుర్చుకోవ‌డం ద్వారా ప‌ప్పు ధాన్యాల లభ్యతపై  ప్రభుత్వం మరింత ధీమాగా ఉంది.  ఈ ఎమ్ ఒ యు కార‌ణంగా భార‌త‌దేశంలో ప‌ప్పు ధాన్యాల అందుబాటు సులువ‌వుతుందనీ,  త‌ద్వారా వాటి ధ‌ర‌లు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తోంది.

 

మరిన్ని వార్తలు