బీమా సంస్థల విలీనం వాయిదా 

9 Jul, 2020 15:29 IST|Sakshi

లాభదాయకతపై దృష్టి

మూడు బీమా సంస్థలకు 12 వేల కోట్ల రూపాయలు నిధులు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థల విలీన ప్రక్రియ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. విలీన ప్రక్రియను నిలిపి వేసిన ప్రభుత్వం లాభదాయక వృద్ధి, నిధుల కేటాయింపు ద్వారా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని  ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌  ఈ మేరకు ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలన్న దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రణాళికను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తాజా నిర్ణయం ప్రకారం మూడు బీమా సంస్థలకోసం 12,450 కోట్ల  రూపాయల నిధులను కేటాయించనుంది. ఇందులో నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి 7,500 కోట్ల రూపాయలు, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు చెరో 5 వేల కోట్ల రూపాయలను నిధులు కేటాయించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. బలహీనమైన ఆర్థిక స్థితికితోడు సంస్థలు వినియోగిస్తున్న వివిధ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లు, తదితర కారణాల రీత్యా ప్రస్తుత ప్రరిస్థితుల్లో విలీనం ఒక సవాలుగా మారిందని అధికారులు  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు