పార్లమెంట్‌లో నేడు రఫేల్‌పై కాగ్‌ నివేదిక

12 Feb, 2019 08:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీరఫేల్‌ ఒప్పందంపై కాగ్‌ నివేదికను ప్రభుత్వం నేడు పార్లమెంట్‌ ముందుంచనుంది. ఫ్రాన్స్‌ కంపెనీ దాసాల్ట్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పాలక, విపక్షాల మధ్య పరస్పర ఆరోపణలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగియనుండటంతో దీనికి కేవలం ఒకరోజు ముందు రఫేల్‌పై కాగ్‌ నివేదికను ప్రభుత్వం పార్లమెంట్‌లో సమర్పించనుండటం గమనార్హం.

రఫేల్‌ ఒప్పందంపై కాగ్‌ నివేదిక పార్లమెంట్‌లో ప్రభుత్వం సమర్పించనున్న క్రమంలో మరోసారి రఫేల్‌ ప్రకంపనలు చట్టసభను కుదిపేయనున్నాయి. మరోవైపు రఫేల్‌ ఒప్పందం జరిగిన సమయంలో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ప్రస్తుత కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మెహర్షి ఈ ఒప్పందంపై ఆడిటింగ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌ ఆరోపించడం మరో వివాదానికి తెరలేపింది. కాగా కపిల్‌ సిబల్‌ ఆరోపణలను కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ తోసిపుచ్చారు. వ్యవస్ధలను నీరుగార్చే ఇలాంటి విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఇక రఫేల్‌పై కాగ్‌ నివేదిక పార్లమెంట్‌లో మరిన్ని ప్రకంపనలకు దారితీస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు