ప్రణయ్‌ హత్య : కౌసల్య శంకర్‌ ఏమన్నారు?

18 Sep, 2018 17:46 IST|Sakshi
ప్రణయ్‌,అమృత, కౌశల్య, శంకర్‌ ( ఫైల్‌ ఫోటో)

సాక్షి,హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకున్న దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్‌ కుమార్ (24) ఘోరమైన హత్యలాంటిదే తమిళనాడులో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడు శంకర్‌ (22) హత్య. ప్రణయ్‌ హత్య జరిగిన వెంటనే కౌసల్య, శంకర్‌ల విషాద గాథ అందరి మదిలో మెదిలింది. కేవలం తమ అమ్మాయి కౌసల్యను కులాంతర వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో శంకర్‌ను కౌసల్య తండ్రి కిరాయి హంతకుల ద్వారా అతిదారుణంగా పట్టపగలే నరికి చంపించిన వైనం అప్పట్లో కలకలం రేపింది. 2016 మార్చిలో తమిళనాడు, తిరుపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అచ్చం ప్రణయ్‌ హత్య తరహాలోనే, మాటువేసి వెనుకనుండి దాడిచేసి పట్టపగలే నడిరోడ్డులో కత్తులతో నరికి చంపారు. ఈ హత్య కూడా సీసీ టీవీలో రికార్డు అయింది. ప్రణయ్‌ హత్యోదంతాన్ని తెలుసుకున్న కౌసల్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలపై ఇలాంటి భయానక హత్యలకు చరమగీతం పాడాలంటే కుల వ్యవస్థ మొత్తం నాశనం కావాలని కౌసల్య పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక మహిళ మరొక కులంలోని వ్యక్తిని వివాహం చేసుకుంటే కులం నాశనమవుతుందని భావిస్తారు. ప్రత్యేకంగా, అబ్బాయి అణచివేత కులానికి చెందిన వాడైతే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. తమ కుమార్తె గర్భంలో మరొక కులానికి చెందిన శిశువు ఎలా ఉంటుందని రగిలిపోతారు. భారతీయ సమాజం మొత్తం కులతత్వ సమాజం. కులతత్వం ఉన్నంతకాలం ఈ భయంకరమైన కుల నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే ప్రభుత్వాలు చొరవ తీసుకుని కులతత్వాన్ని సమూలంగా నాశనం చేసే మార్గాన్ని కనుగొంటే తప్ప, వీటికి అడ్డుకట్ట పడదని ఆమె చెప్పింది. హింస నుండి మహిళలను కాపాడడానికి చట్టాలున్నాయి కాబట్టే కొంతమేరకు పోరాడగలుగుతున్నాం. కానీ పరువు హత్యలపై ఇప్పటికీ ఎలాంటి చట్టాలు లేవు. ఇలాంటి పటిష్టమైన చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకు రావాల్సి ఉంది. కఠినచట్టాలు, రక్షణ లేకుండా , కేవలం నోటిమాటలతో ఈ హత్యల్ని ఆపలేం. ఇలాంటి వివాహాలు తప్పు కాదని చెప్పే చట్టాలు రావడంతోపాటు ఆయా జంటలకు ప్రోత్సాహన్నందించాలని కౌశల్య ఆకాంక్షించారు.

మా తరువాత చాలా జంటల్ని కులం పొట్టన పెట్టుకుంది. మహిళలను శిశువులను తయారుచేసే యంత్రాలుగానే సమాజం చూస్తోంది. కేవలం కులాన్ని కాపాడే దేవతలుగా మాత్రమే మహిళల్ని గౌరవిస్తున్నారని కౌశల్య ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తమ తల్లిదండ్రులకు ఇష్టంలేకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు  పోలీస్‌ స్టేషన్ల నుంచి సరైన మద్దతు లభించడం లేదన్నారు. వారికిష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు అంటూ ఆ జంటను విడదీయడానికి ప్రయత్నిస్తారు. పోలీసులు ఇలా ఎందుకు చేయాలి? చట‍్ట ప్రకారం, ​న్యాయం వైపు వారు ఎందుకు వుండరు?  పోలీసులు హింసనుంచి ప్రజలను రక్షించాలని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఏ ఆఫీసర్‌ అలా చేయడం లేదని కౌశల్య  ఆరోపించారు. పెరియార్, అంబేద్కర్ చెప్పినట్టుగా మహిళల విముక్తి లేకుండా కులవ్యవస్థ నిర్మూలన సాధ్యం కాదు. ఈ రోజుల్లో కులాలు ఎక్కుడున్నాయని అందరూ అంటారు. కానీ, ప్రతిరోజూ అనుభవిస్తున్న వారికి మాత్రమే ఆ వివిక్ష తాలూకు బాధేంటో తెలుసునని కౌశల్య వ్యాఖ్యానించారు.

కాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త కన్నవాళ్ల చేతుల్లోనే దారుణంగా హత్య కావడంపై కౌసల్య న్యాయపోరాటం చేసారు. నేరస్తులకు ఉరిశిక్షపడేదాకా మొక్కవోని ధైర్యంతో పోరాడారు. ప్రస్తుతం కులనిర్మూలన కోసం పోరాటం చేస్తున్నారు..  మరోవైపు కౌశల్య తరహాలోనే అమృత ప్రణయ్‌ కూడా కులనిర్మూలనకోసం ఉద్యమిస్తానని చెప్పడం గమనార‍్హం.

మరిన్ని వార్తలు