డ్రోన్లతో భారత్‌లోకి పాక్‌ ఆయుధాలు

26 Sep, 2019 03:57 IST|Sakshi
డ్రోన్‌లు భారత భూభాగంలో పడేసిన ఆయుధాలు, మందు గుండు, కరెన్సీ

ఖలిస్తాన్‌ ఉగ్రమూకల దుశ్చర్య

కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రేరేపించడమే లక్ష్యం  

చండీగఢ్‌: పాకిస్థాన్‌లోని ఖలిస్థాన్‌ ఉగ్రమూకలు సెప్టెంబర్‌ 9 నుంచి 16 వరకు డ్రోన్‌ల ద్వారా 80 కేజీల బరువుగల ఆయుధాలూ, మందుగుండు సామాగ్రిని సరిహద్దులగుండా భారత్‌లోనికి జారవిడిచినట్టు భారత భద్రతాదళాలూ, పంజాబ్‌ పోలీసులు ధృవీకరించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను ప్రేరేపించడం కోసం పాకిస్తాన్‌ గూఢచారి వ్యవస్థ మద్దతుతో ఖలిస్థాన్‌ తీవ్రవాద శక్తులు ఈ చర్యకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన అమృత్‌సర్‌లోని తరన్‌ తరన్‌ జిల్లాలో డ్రోన్‌ల ద్వారా జారవిడిచిన ఆయుధసామగ్రిపై విచారణ జరపడంతో విషయంవెలుగులోకి వచ్చింది.

పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడం కోసం పాకిస్తాన్, జర్మనీ మద్దతుతో ఖలిస్తాన్‌ జిందాబాద్‌ ఉగ్రమూకలు కుట్రపన్నుతున్నట్టు భారత భద్రతాదళాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో 2 కిలోమీటర్ల దూరం నుంచి ఈ డ్రోన్లను పంపించారు. అయితే ఇవి 2000 అడుగుల ఎత్తులో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 1200 అడుగుల కిందకి దిగి ఆయుధాలను జారవిడిచినట్టు వెల్లడయ్యింది. డ్రోన్ల ద్వారా జారవిడిచిన వాటిలో ఐదు ఏకే – 47 తుపాకులు, 16 మ్యాగజైన్స్, 472 రౌండ్లకు సరిపడా మందుగుండ్లు, చైనాలో తయారైన నాలుగు 30 బోర్‌ పిస్టల్స్‌ తదితర సామాగ్రితో పాటు ఐదు సాటిలైట్‌ ఫోన్లు, రెండు మొబైల్‌ ఫోన్లు, రెండు వైర్‌లెస్‌ సెట్లు, 10 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు.

డ్రోన్లు వస్తే పేల్చేస్తాం
హిసార్‌: ఇతర దేశాల సరిహద్దుల నుంచి భారత్‌లోకి ఎలాంటి డ్రోన్లు, అనుమానిత పరికరాలు ప్రవేశించినా వెంటనే పసిగట్టే సత్తా మన సైనిక దళాలకు ఉందని సౌత్‌ వెస్ట్రన్‌ కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అలోక్‌సింగ్‌ క్లేర్‌ చెప్పారు. భారత్‌–పాక్‌ సరిహద్దు వెంట ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో ఆయుధాలను జార విడుస్తున్నా రంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. పాకిస్తాన్‌ భూభాగం నుంచి భారత్‌లోకి వైపు డ్రోన్లు ప్రవేశిస్తే వెంటనే పేల్చేస్తామని స్పష్టం చేశారు. డ్రోన్ల గురించి ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న డ్రోన్ల సామర్థ్యం పరిమితమేనన్నారు.

మరిన్ని వార్తలు