షా అధికార నివాసానికి ఘన చరిత్ర

10 Jun, 2019 06:48 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు త్వరలో కేటాయించనున్న కొత్త నివాసానికి ఘన చరిత్ర ఉంది. బ్రిటిష్‌ పాలకుల హయాంలో పార్లమెంట్‌ భవన వాస్తుశిల్పి సర్‌ హెర్బర్ట్‌ బేకర్‌ విశాలమైన ఈ భవనంలోనే ఉన్నారని చరిత్ర చెబుతోంది. స్వతంత్ర భారతంలో ఇద్దరు సొలిసిటర్‌ జనరళ్లు, మాజీ ప్రధానులు వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్‌ కూడా ఇందులో నివసించారని చరిత్రకారిణి, రచయిత స్వప్నా లిడ్లే తెలిపారు. బ్రిటిష్‌ పాలకుల హయాంలో రాజధాని ఢిల్లీ ప్రధాన వాస్తుశిల్పి సర్‌ ఎడ్విన్‌ లండ్సీర్‌ ల్యుటెన్‌ అయినప్పటికీ, ప్రభుత్వ సెక్రటేరియట్‌ ఉండే నార్త్, సౌత్‌ బ్లాకులతో పాటు పలు కీలక భవనాల రూపకల్పన చేసిన సర్‌ బేకర్‌.. ప్రస్తుతం 6ఏ నంబర్‌తో ఉన్న ఈ భవనంలోనే నివసించారు. అంతకుముందు ఈ భవనాన్ని హేస్టింగ్స్‌ రోడ్‌లోని 8వ నంబర్‌ భవనంగా పరిగణించేవారు. స్వాతంత్య్రానంతరం ఇది కృష్ణమీనన్‌ మార్గ్‌లోని 8వ నంబర్‌ బంగ్లాగా మారిపోయింది.

ఇందులో ఉన్న చివరి ప్రముఖుడు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి. ఆయన దాదాపు 14 ఏళ్లపాటు ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో వాజ్‌పేయి మరణించడంతో డిసెంబర్‌లో కుటుంబసభ్యులు ఈ ఇంటిని ఖాళీ చేశారు. బ్రిటిష్‌ చక్రవర్తి 5వ జార్జి కాలంలో 1911లో దేశ రాజధాని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మారిన విషయం తెలిసిందే. లండన్‌లోని రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్స్‌ వద్ద కూడా ఈ భవనం ఫొటో భద్రంగా ఉందని స్వప్నా లిడ్లే అన్నారు.  హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్‌ షా ప్రస్తుతం అక్బర్‌ రోడ్డులోని 11వ నంబర్‌ బంగ్లాలో ఉంటున్నారు. త్వరలోనే ఆయనకు కృష్ణమీనన్‌ మార్గ్‌లోని 6ఏ భవనాన్ని ప్రభుత్వం కేటాయించే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు