చినుకు జాడేది?

24 Jun, 2014 23:28 IST|Sakshi
చినుకు జాడేది?

- ఆవిరవుతున్న రైతన్న ఆశలు
- నిండుకుంటున్న జలాశయాలు
- తాగునీటికీ తప్పని కటకట
- కృత్రిమ వర్షాలపై బీఎంసీ దృష్టి
- జూలై రెండోవారంలోనే వర్షాలు
- కోతలకు సిద్ధమవుతున్న సర్కార్
 పింప్రి, న్యూస్‌లైన్:
వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు దాటుతున్నా చినుకు జాడ లేకపోవడంతో అటు రైతుల్లోనూ, ఇటు నగరవాసుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పటికంటే ఈ ఏడాది వర్షం తక్కువగా కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు ముందుగానే వెల్లడించిన తక్కువ మాట అటుంచి అసలు చినుకు జాడే లేదని, మరో పక్షం రోజులు ఇలాగే గడిస్తే ఈ సీజన్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ఆలస్యంగా విత్తినా దిగుబడి ఆశించిన స్థాయిలో రావడం అసాధ్యమంటున్నారు. రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ ఇలా ఏ ప్రాంతమైనా వర్షం కురిసిన జాడే లేదని, దీంతో ఈసారి కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనంటున్నారు.
 
మరో పక్షంరోజులు ఇంతే...
పుణే వాతావరణ పరిశోధన విభాగం తెలిపిన వివరాల మేరకు.. జూలై మొదటి వారం తర్వాత వర్షాలు కురిసే అవకాశముంది. ఒకవేళ అప్పటికీ వర్షం కురవకపోతే తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవంటున్నారు. ప్రస్తుతం ముంబై, పుణే వంటి పెద్ద నగరాలకు నీటిని సరఫరా చేసే జలాశయాల్లో కొంతమేర నీటి నిల్వలున్నా అవి అవసరాలకు సరిపడా లేవని, జూన్ రెండో వారంలో వర్షాలు కురిసే వరకు సరిపోతాయనే భరోసాతో ఉన్న అధికారులకు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. నగరవాసులకు నీటి సరఫరాలో 20 శాతం కోత విధించే అంశమై ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నట్లు రాష్ట్ర సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ తెలిపారు.
 
అడుగంటుతున్న జలాశయాలు...
పుణే, ముంబై వంటి మహానగరాలకు సరఫరా చేసే మంచి నీటి రిజర్వాయర్లు, డ్యాంలలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. రాబోయే రోజులను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికలపై అధికారులు దృష్టి సారించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వీటికితోడు అకాాల వర్షాలు, వడగండ్లతో రాష్ట్ర రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు.

వీరిని  ఆదుకోవడానికి రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు రెండు సంవత్సరాలలో 9 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాయి. అయితే ఈ ప్యాకేజీలు ఏమూలకు సరిపోవడం లేదు. ఇప్పుడు వరుణుడు ముఖం చాటేయడంతో వరుసగా ఈ ఏడాది కూడా కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇప్పటి వరకు 25 నుంచి 30 శాతం వ్యవసాయ పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా కేవలం 1.5 శాతం మాత్రమే పూర్తయినట్లు చెబుతున్నా వర్షాలు కురవకపోతే అవి కూడా నిష్ర్పయోజనంగా మారే అవకాశముంది. రాష్ర్టంలో ప్రధాన రిజర్వాయర్లలో కేవలం 20 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆయా నగరాలలోని ప్రజల దాహార్తిని తీర్చడానికి నీటి నిల్వలు ఏమూలకూ సరిపోక పోవడంతో అధికారులలో కూడా ఆందోళన మొదలైంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు విభాగాల పరిధిని గమనిస్తే నాగ్‌పూర్‌లో 46 శాతం, మరాఠ్వాడాలో 20 శాతం, నాసిక్‌లో 14 శాతం, పుణే విభాగంలో 13 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. మొత్తం ఇప్పుటి వరకు 1,464 గ్రామాలకు, 3,687 వీధులకు 1,454 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.
 
కృత్రిమ వర్షాలతో ప్రయోజనముండదు: పాటిల్
రాష్ర్టంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కృత్రిమ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందా? అన్న ప్రశ్నకు.. గ్రామీణాభివృద్ధి మంత్రి జయంత్ పాటిల్.. ‘అలాంటి ఆలోచన లేదు. దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండద’ని సమాధానమిచ్చారు. దీని వల్ల పంటలకు ప్రయోజనంగా ఉంటుందేమో కానీ తాగు నీటి సమస్య తీరదన్నారు. పుణేలో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మంత్రి జయంత్ పాటిల్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృత్రిమ వర్షాల వల్ల కేవలం రెండు నుంచి మూడు మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే కురుస్తుందన్నారు.
 
కృత్రిమ వర్షాలపై దృష్టిసారించిన బీఎంసీ
వర్షాలు పత్తాలేకుండా పోవడంతో మహానగర పాలక సంస్థ(బీఎంసీ) కృత్రిమ వర్షాలవైపు దృష్టి సారించింది. అందుకు  టెండర్లను ఆహ్వానించేందుకు ఈ నెల 17న ప్రకటన జారీచేసింది. టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 26 వరకు గడువు ఇచ్చారు. ఆ తరువాత 27 నుంచి ఆన్‌లైన్‌లో టెండర్లు దాఖలు చేయడానికి అవకాశముంటుందని బీఎంసీ అదనపు కమిషనర్ రాజీవ్ జలోటా చెప్పారు.

కృత్రిమ వర్షం కోసం రూ.15.75 లక్షలు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నాసిక్, ఠాణే పరిసరాల్లోని కార్పొరేషన్ పరిధిలోని జలాశయాలున్న ప్రాంతాల్లో కృత్రిమ వర్షం కోసం ప్రయత్నాలు చేయనున్నట్లు జలోటా చెప్పారు. గతంలో ఇలాంటి ప్రయోగాలు చేసినప్పటికీ అనుకున్నంతమేర ఫలితాలు ఇవ్వలేదు. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పటికీ ఈ ప్రయోగం సఫలీకృతం కాకపోవడంతో నిరాశే మిగిలింది.

>
మరిన్ని వార్తలు