రూల్స్‌ బ్రేక్‌: నడిరోడ్డుపై పెళ్లికొడుక్కి జరిమానా

16 Jun, 2020 12:57 IST|Sakshi

భోపాల్‌: కరోనా ఆంక్షల నేపథ్యంలో మాస్క్‌ లేకుండా రోడ్డుపైకి వచ్చిన పెళ్లి కొడుక్కి జరిమానా విధించిన ఘటన సోమవారం రోజున మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపుల అనంతరం.. ఇండోర్‌లో పెళ్లి చేసుకునేందుకు 12 మందికి అనుమతి ఉంది. అయితే పెళ్లి కొడుకు ధర్మేంద్రతో పాటు పెళ్లికి హాజరవుతున్న 12 మంది వ్యక్తులు కూడా ఒకే వాహనంలో మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన అధికారులు వారికి జరిమానా విధించారు.

ఈ సంఘటనపై మన్సిపల్‌ కార్పొరేషన్‌ హెల్త్‌ ఆఫీసర్‌ వివేక్‌ గ్యాంగ్‌రాడే మాట్లాడుతూ.. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్కులు లేకుండా, నిబంధనలు పాటించకుండా వారు కనిపించడంతో పెళ్లికొడుకుతో పాటు మరో 12 మందికి ఫైన్‌ వేసినట్లు తెలిపారు. భౌతిక దూరం పాటించనందుకు రూ. 1,100.. మాస్క్‌లు ధరించనందుకు రూ. 1,000 జరిమానా విధించినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలోనే జరిమానా రుసుమును కూడా వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇండోర్‌లో ఇప్పటిదాకా 4,069 కరోనా కేసులు నమోదవ్వగా.. 174 మంది మరణించారు. చదవండి: కరోనా: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు