చిన్నమ్మ చేతిలో రిమోటేనా?

10 Apr, 2017 12:37 IST|Sakshi
చిన్నమ్మ చేతిలో రిమోటేనా?

- విభేదాలు మరిచి విధేయుడిగా మారతారా?
- స్వతంత్రంగా వ్యవహరిస్తే సమీకరణాలేంటి?
- పన్నీర్ సెల్వంపై ఏఐఏడీఎంకే వర్గాల్లో చర్చ

 

 చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జయలలితకు అత్యంత విధేయుడు, నమ్మకస్తుడిగా కొనసాగిన తమిళనాడు సీఎం ఓ.పన్నీర్ సెల్వం పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న శశికళకు కూడా విధేయుడిగా ఉంటారా? ’’అమ్మ చెబుతుంది, నేను చేస్తాను’’ అని జయలలిత మీద తనకున్న భక్తిని చాటుకున్న సెల్వం ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తే సమీకరణలు ఎలా ఉంటారుు? ఆ పార్టీలో శశికళ శకం ప్రారంభం అవుతుందా? జయలలిత అంతిమ సంస్కారం ముగిసిన అనంతరం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఈ తరహా చర్చలు జోరందుకున్నారుు. శశికళకు, పన్నీర్ సెల్వంకు మధ్య ఉన్న అభిప్రాయాల భేదాల నేపథ్యంలో తమిళనాట అనేక రాజకీయ ఊహాగానాలు సాగుతున్నాయి.

జయలలిత నెచ్చెలిగా ముద్రపడి అన్నాడీఎంకే రాజకీయాల్లోనూ తనవంతు పాత్ర పోషిస్తున్న శశికళ పార్టీలో, ప్రభుత్వంలో తన పట్టు పెంచుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఒక దశలో జయలలిత ఆత్మ శశికళ అనేంతగా తన హవా నడిపారు. ఇదే క్రమంలో 2011లో జయలలితకే ఎసరు పెట్టేందుకు తెరచాటు ప్రయత్నాలు చేశారు. తన కులస్తుడైన (దేవర ) పన్నీర్ సెల్వంను కూడా జట్టులోకి ఆహ్వానించారు. అమ్మ విధేయుడైన సెల్వం జయకు ఈ విషయం చెప్పేయడంతో శశికళకు, సెల్వంకు మధ్య అప్పటినుంచే విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం జయ మరణంతో వీరి మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

 శశికళ చక్రం తిప్పాలనుకున్నా..
  జయలలిత మరణానంతరం ఏఐఏడీఎంకేలో లుకలుకలు, అనిశ్చితి నేపథ్యంలో శశికళ పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా తానే నడిపించేందుకు అవసరమైన బలసమీకరణకు పూనుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అరుుతే ప్రధాని నరేంద్ర మోదీ  భవిష్యత్తులో తమకు అనుకూలంగా మెలిగేందుకు అవకాశం ఉన్న పన్నీర్ సెల్వం వైపు మొగ్గు చూపారు. జయలలిత సోమవారం సాయంత్రమే కన్ను మూసినా అధికారికంగా ప్రకటించకుండా చేసి మంత్రి వెంకయ్య నాయుడును చెన్నైకు పంపి శశికళ- పన్నీర్ మధ్య రాజీ కుదిర్చే వ్యూహం అమలు చేశారు. ఆ తర్వాతే సెల్వంను శాసనసభా నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటన వెలువడింది. పార్టీ బాధ్యతలు శశికళకు అప్పగించడానికి ప్రాథమికంగా నిర్ణయం జరిగింది.

పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకుని, ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో నడిపించే ఆలోచనతోనే శశికళ ఈ ప్రతిపాదనకు అంగీకరించారనే ప్రచారం జరుగుతోంది. జయలలిత భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రధాని మోదీతో చనువుగా మెలగడం, ఆయన ప్రత్యేకంగా తనతో సంభాషించి ఓదార్చేలా చేసుకోవడం ద్వారా ప్రధాని వద్ద తనకు కూడా గట్టి మద్దతే ఉందని పన్నీర్ సెల్వంకు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఏది ఏమైనా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరూ కొంతకాలం పాటు సర్దుబాటు ధోరణితో వ్యవహరించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరోవైపు అన్నాడీఎంకేలో జరిగే చిన్న పరిణామాలను కూడా ప్రతిపక్ష డీఎంకే పార్టీ నిశితంగా గమనిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు ఎంత ఉన్నప్పటికీ అన్నా డీఎంకేలోని కలహాల కుంపటి ఆర్పడం వీలు కాదనీ, అరుుతే ఇది తమకు ఎంత మేరకు కలిసొస్తుందని మాత్రం ఇప్పుడే చెప్పలేమని డీఎంకే నేతలు అంటున్నారు. కాగా జయలలిత మరణం తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణలకు దారితీసే అవకాశాలు కొట్టి పారేయలేమని విశ్లేషకులంటున్నారు.

  టీ దుకాణం యజమాని నుంచి సీఎం దాకా...
  తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా పెరియకులం గ్రామానికి చెందిన ఒట్టికార దేవర్, పళనియమ్మాల్‌కు 1951 జనవరి 14వ తేదీ పన్నీర్‌సెల్వం జన్మించారు. గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న ఆయన వారసత్వంగా వచ్చిన కొంత వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తూ పెరియకులంలో టీ దుకాణం నిర్వహించే వారు. ఎంజీ రామచంద్రన్ అభిమాని అరుున సెల్వం అనూహ్య పరిణామాల నేపథ్యంలో 1996లో పెరియకులం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2001 ఎన్నికల్లో అమ్మ ఆశీస్సులతో బోడినాయకనూరు నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటినుంచే జయకు నమ్మినబంటుగా మారారు.