తప్పిపోయిన జీశాట్‌.. షాకింగ్‌ న్యూస్‌

2 Apr, 2018 19:31 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : ఇస్రోతో సంబంధాలు కోల్పోయిన ఉపగ్రహం జీశాట్‌-6ఏ పై అంతరిక్ష నిపుణులు విస్మయానికి గురి చేసే ప్రకటన చేశారు. మరికొద్ది గంటల్లో గనుక అనుసంధానం కాకపోతే అది అంతరిక్షంలో ఓ శకలంగా మిగిలిపోవటం ఖాయమని పేర్కొంటున్నారు. 

‘సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు 48 గంటల్లోపు తిరిగి సంధానం అవుతుంటాయి. కానీ, ఇప్పటిదాకా జీశాట్‌-6ఏ గురించి ఇస్రో ఎలాంటి స్పష్టతకు రాలేకపోతోంది. ఆ లెక్కన్న ఈ ప్రయోగం ముగిసిందనే అనుకోవాలి. అయితే మరికొద్ది గంటలు మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. పూర్తి ఇంధనంతో అంతరిక్ష శకలంగా మిగిలే మొదటి ఉపగ్రహంగా జీశాట్‌-6ఏ చరిత్రలో మిగిలిపోతుంది’ అని వాళ్లు చెబుతున్నారు.

సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు సుమారు రూ.270 కోట్ల వ్యయంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే.  మార్చి 29న నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌08 ద్వారా జీశాట్‌- 6ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉపగ్రహంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ జరిగి సిగ్నల్స్‌ ఆగిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో ఆదివారం అధికారికంగా ప్రకటించింది.

అయితే విద్యుత్‌ వ్యవస్థలో లోపం వల్లే అనుసంధానం తెగిపోయి ఉంటుందని ఇస్రో అనుమానిస్తోంది. ‘సోలార్‌ వ్యవస్థ విఫలమైతే బ్యాటరీలు వాటికవే పని చేయాలి. కానీ, అది జరగలేదు. కాబట్టి మొత్తం  విద్యుత్‌ వ్యవస్థ చెడిపోయి ఉంటుందని భావిస్తున్నాం. అయినప్పటికీసంబంధాలను పునరుద్ధరించేందుకు మా వంతు మేం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం ఇస్రో తన పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నానికల్లా దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  మరింత సమాచారం కోసం క్లిక్‌ చెయ్యండి

మరిన్ని వార్తలు