హమ్మయ్య.. పుష్ప జీవితం మారనుంది

9 Dec, 2015 18:55 IST|Sakshi
హమ్మయ్య.. పుష్ప జీవితం మారనుంది

న్యూఢిల్లీ: ఎట్టకేలకు జాతీయ షూటర్ పుష్పా గుప్తా(21) జీవితం మారనుంది. గుజరాత్ ప్రభుత్వం ఆమెకు బాసటగా నిలిచింది. జాతీయ స్థాయిలో షూటింగ్లో పతకాలు గెలుచుకున్న ఆమె తన కుటుంబ పోషణ కోసం నూడుల్స్ అమ్ముతున్న విషయం వార్తల్లోకి ఎక్కి అందరిని విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితి పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు. ఆమె పరిస్థితిపట్ల స్పందించిన గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్(జీఎస్ఎఫ్సీ) ఆమెకు ఉద్యోగాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. జీఎస్ఎఫ్సీ చైర్మన్ ఎస్‌ నందా ఆమె చదువు పూర్తికాగానే నేరుగా తమ సంస్థలో నియామకం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఆమె షూటింగ్ క్రీడను కూడా కొనసాగించేలా చేస్తామని తెలిపారు.

జాతీయ స్థాయి షూటర్ అయిన గుప్తా ప్రస్తుతం బీకాం మూడో సంవత్సరం చదువుతుంది. పేదరికంలో ఉన్న తన కుటుంబానికి ఆర్థికపరమైన చేదోడువాదోడుగా ఉండేందుకు గత ఏడాదిగా నూడుల్స్ అమ్ముతోంది. ఆమె ఎన్సీసీ కోర్సు కూడా పూర్తి చేసింది. 'నేను 2013లో కాలేజీలో జాయిన్ అయ్యాను. అప్పుడే నాకు షూటింగ్ స్కిల్స్ ఉన్నాయని గుర్తించాను. వెంటనే నేషనల్ కేడెట్ కార్ప్స్ లో జాయిన్ అయ్యాను. అది కొంత ఆర్థికంగా సహాయపడింది. నేను గుజరాత్ ప్రతినిధిగా పలుసార్లు మంచి ప్రదర్శన చేశాను. అందుకే షూటింగ్ పై ఆసక్తి పెట్టాను' అని పుష్ప చెప్పింది.

మరిన్ని వార్తలు