ఇండియా ఫస్ట్‌

26 May, 2017 04:17 IST|Sakshi
ఇండియా ఫస్ట్‌

సంస్కరణలతోనే విదేశీ పెట్టబడులను ఆకర్షించగలమని మోదీ ప్రభుత్వం విశ్వాసం. అందుకే దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండాలనే దృఢ సంకల్పంతో... ఎన్ని అడ్డంకులు ఎదురైనా జీఎస్‌టి బిల్లు తెచ్చింది. రాష్ట్రాలను ఒప్పించి అమలు దశకు చేర్చింది. ఎఫ్‌డీఐలకు అనుమతులు, వ్యాపార అనుమతులను సరళతరం చేసింది.lమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... భారత్‌ పట్ల ప్రపంచదేశాల దృక్పథం బాగా మారింది. భారత్‌ బలమేమిటో, బలహీనతలేమిటో... మోదీకి స్పష్టంగా తెలుసు. అందుకే ‘మేకిన్‌ ఇండియా’ నినాదంతో విదేశీ పెట్టుబడులను, సాంకేతికతను ఆహ్వానించారు.

అదే సమయంలో భారత ఉత్పత్తులకు మార్కెట్లను చూడటం అనేది కూడా భారత విదేశాంగ విధానంలో భాగమైంది. యాపిల్‌ లాంటి పెద్ద సంస్థ ఎంతగా ఒత్తిడి తెచ్చినా... మోదీ ప్రభుత్వం ఆ సంస్థ ఫోన్లను మరోచోటి నుంచి భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించలేదు. దాంతో భారత్‌లో ఫోన్ల తయారీ యూనిట్‌ను పెట్టడానికి యాపిల్‌ ముందుకు వచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 21 రంగాల్లో 87 ఎఫ్‌డీఐ నిబంధనలను మార్చారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 60 బిలియన్‌ డాలర్లు (3,93,000 కోట్ల రూపాయలు) ఎఫ్‌డీఐలు వచ్చాయి.

ఇరుగుపొరుగుకు స్నేహహస్తం...
పరస్పర సహకారం, భాగస్వామ్యంతో ప్రగతి సాధ్యమని భావించి భారత్‌... ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలకు ప్రాధాన్యమిచ్చింది. మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్‌ దేశాధినేతలందరినీ ఆహ్వానించారు. చిన్న, పెద్ద దేశాలనే తేడా లేకుండా స్నేహహస్తం చాచింది. ప్రధానిగా మోదీ దేశాధినేతలతో నిరంతరం సంప్రదింపులు జరపడం, పర్యటనలు చేయడం మూలంగా ప్రాంతీయ సంబంధాలు బలపడ్డాయి. ఇటీవలే బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు స్వాగతం పలకడానికి మోదీ ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లారు.

బంగ్లాదేశ్‌తో మిత్రుత్వానికి భారత్‌ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియచెప్పారు. దశాబ్దాలపాటు కొన్ని దేశాలకు భారత్‌ దూరంగా ఉంది. మోదీ ప్రధాని అయ్యాక అలాంటివేమీ లేకుండా... మనకు ప్రయోజనం అనుకున్న ప్రతి దేశంతోనూ సంబంధాలు నెరుపుతున్నారు. దక్షిణాసియా దేశాల కోసం 450 కోట్లు ఖర్చు పెట్టి రూపొందిన జీశాట్‌–9ను ఈ నెల 5న ప్రయోగించారు. 12 ఏళ్లపాటు సార్క్‌ దేశాలకు ఉచిత సేవలందించే ఈ ఉపగ్రహం ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయనుంది. అలాగే ఆఫ్గనిస్థాన్‌ పార్లమెంటు భవన నిర్మాణానికి భారత్‌ ఆర్థిక సహాయం చేసింది.

ప్రపంచ సమస్యలపై...
ప్రపంచం ముందున్న సవాళ్లపై చర్చల్లో భారత్‌ చొరవ తీసుకుంటోంది. బరువు బాధ్యతలు తీసుకుంటోంది. వివిధ అంశాలపై అగ్రరాజ్యాలతో, పలు ప్రపంచ, ప్రాంతీయ సంస్థలతో భారత్‌ కలిపి పనిచేస్తోంది. వాతావరణ మార్పు, సాంకేతిక సహకారం, తీవ్రవాదం, నైపుణ్య శిక్షణ, వాణిజ్య, సేవల ఒప్పందాలు, ఇంధన స్వాలంబన... అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ చురుకుగా పనిచేస్తున్న రంగాలు.

సాంస్కృతిక వారధి...
ఆయా దేశాలతో మనకుగల సాంస్కృతిక సంబంధాలు, ఉమ్మడి విలువలు, సంప్రదాయాల గురించి తరచూ మాట్లాడటం ద్వారా మోదీ చారిత్రకంగా ఇరుదేశాల మధ్య అనుబంధం ఉందనేది గుర్తుచేస్తూ బంధాలను బలోపేతం చేస్తున్నారు. జపాన్, చైనా, మంగోలియా, బంగ్లాదేశ్, శ్రీలంకలకు వెళ్లినపుడు... మోదీ అక్కడి విఖ్యాత సాంస్కృతిక కేంద్రాలను సందర్శించారు. గత ఏడాది జూన్‌ 21న ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచదేశాలన్నీ యోగా డేను జరుపుకొన్నాయి.

ఎన్‌ఆర్‌ఐలతో సన్నిహిత సంబంధాలు...
మోదీ అధికారంలోకి వచ్చాక విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐలు) చేరువయ్యేందుకు, వారిలో విశ్వాసం పాదుకొల్పడానికి గట్టి ప్రయత్నమే చేశారు. అమెరికా, బ్రిటన్‌లలో పెద్ద స్టేడియాల్లో వేల సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి మాట్లాడటమే కాకుండా... వారు చేస్తున్న విజ్ఞప్తులపై విదేశాంగ శాఖ సత్వరం స్పందిస్తోంది. ఏ దేశానికి వెళ్లినా... అక్కడుండే భారతీయులను కలవడం మోదీ ఒక అలవాటుగా చేసుకొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి అజెండాలో భాగస్వాములయ్యేలా ఎన్‌ఆర్‌ఐలను ప్రొత్సహిస్తున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వపరంగా నిబంధనలను సరళతరం చేస్తామని వారిని కోరుతున్నారు.

(మరిన్ని వివరాలకు చదవండి)
(కొంచెం మోదం! కొంచెం ఖేదం!!)
(
మోదీ మ్యానియా)
(
57 విదేశీ పర్యటనలు)
(మోదీ ప్రజల ప్రధానే..!)

మరిన్ని వార్తలు