29 వస్తువులపై పన్నుకోత

19 Jan, 2018 01:19 IST|Sakshi

54 సేవలపై పన్ను తగ్గింపు

వ్యాపారుల రిటర్నుల సరళీకరణపై చర్చ

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌పై తదుపరి భేటీలో చర్చిస్తాం: జైట్లీ  

న్యూఢిల్లీ: సామాన్యులకు మరింత ఊరటనిచ్చేలా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మండలి మరోసారి పన్ను రేట్లను తగ్గించింది. తాజాగా 29 వస్తువులు, 54 సేవలపై పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన పన్ను రేట్లు ఈ నెల 25 నుంచే అమల్లోకి రానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి 25వ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది.   

రిటర్నుల సరళీకరణపై చర్చ
వ్యాపారులు నెలకు ఒకటే రిటర్నును దాఖలు చేసేలా జీఎస్టీ రిటర్నుల విధానాన్ని సరళీకృతం చేయడంపై జీఎస్టీ మండలి చర్చించింది. జీఎస్టీ రిటర్నులను సరళతరం చేయడంపై ఇన్ఫోసిస్‌ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ నీలేకని జీఎస్టీ మండలికి ఓ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రస్తుతం వాణిజ్య సంస్థలు జీఎస్టీఆర్‌–3బీ, జీఎస్టీఆర్‌–1 అంటూ రెండు రిటర్నులను దాఖలు చేస్తుండగా, ఇకపై 3బీతోపాటు ఇన్‌వాయిస్‌లు కూడా సమర్పిస్తే సరిపోతుందా అన్నదానిపై ఆలోచిస్తున్నామని జైట్లీ చెప్పారు.

ముడి చమురు, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, విమాన ఇంధనం తదితరాలను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై తదుపరి జీఎస్టీ మండలిలో చర్చించే అవకాశం ఉందని చెప్పారు. అంతర్రాష్ట్ర సరుకు రవాణా కోసం ఎలక్ట్రానిక్‌ వే బిల్లు విధానం ఫిబ్రవరి 1 నుంచి అమలవుతుందనీ, 15 రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల్లో సరుకు రవాణాకు సైతం ఈ–వే బిల్లును ఆ రోజు నుంచే అమలు చేస్తామని చెప్పాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేవలం వాణిజ్య సంస్థలు ఇస్తున్న సమాచారం ఆధారంగానే జీఎస్టీ వసూలవుతోందనీ, పన్ను ఎగవేతదారులను నిరోధించేలా చర్యలు తీసుకుంటే ఆదాయం పెరుగుతుందని అన్నారు. కాగా, వజ్రాలు, విలువైన రాళ్లపై పన్నును 3 నుంచి 0.25 శాతానికి తగ్గించారు. అలాగే థీమ్‌ పార్క్‌ టికెట్లు, దర్జీ సేవలపై కూడా పన్ను రేట్లు తగ్గాయి.

28 నుంచి 18 శాతానికి తగ్గినవి
సెకండ్‌ హ్యాండ్‌లో కొనే పెద్ద, మధ్యస్థాయి కార్లు, ఎస్‌యూవీలు (మిగతా అన్ని రకాల సెకండ్‌ హ్యాండ్‌ మోటార్‌ వాహనాలపై పన్నును 28 నుంచి 12 శాతానికి తగ్గించారు) ళీ జీవ ఇంధనాలతో నడిచే, ప్రజా రవాణాకు ఉపయోగించే బస్సులు.
18 నుంచి 12 శాతానికి తగ్గినవి
చక్కెర ఉండే స్వీట్లు, చాక్లెట్లు, 20 లీటర్ల తాగునీటి సీసాలు, ఎరువుగా ఉపయోగించే పాస్ఫరిక్‌ యాసిడ్, బయో డీజిల్, వేప ఆధారిత పురుగు మందులు, కొన్ని రకాల జీవ–పురుగుమందులు, డ్రిప్‌ల వంటి నీటిపారుదల పరికరాలు, స్ప్రింక్లర్లు, స్ప్రేయర్లు.
18 నుంచి 5 శాతానికి తగ్గినవి
చింతగింజల పొడి, మెహందీ కోన్లు, ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్లు సరఫరా చేసే ఎల్‌పీజీ సిలిండర్లు.
12 నుంచి 5 శాతానికి తగ్గినవి
వెదురు/ఎండుగడ్డితో తయారైన బుట్టలు తదితర వస్తువులు, అల్లికతో తయారైన వస్తువులు, వెల్వెట్‌ వస్త్రాలు
సున్నా శాతానికి తగ్గిన వస్తువులు
విబూది, వినికిడి పరికరాల విడి భాగాలు, తవుడు

మరిన్ని వార్తలు