ఆగస్టు 31వరకు జీఎస్టీ రిటర్నులు

1 Jul, 2020 01:39 IST|Sakshi

ఎన్నారై, టీడీఎస్, టీసీఎస్, ఐటీసీ రిటర్నుల దాఖలుకు గడువు పెంపు

సాధారణ పన్ను చెల్లింపుదారులు కాంపోజిట్‌ గ్రూపునకు మారే వెసులుబాటు..

ఇందుకు గడువు జూలై 31గా కౌన్సిల్‌ నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ చెల్లింపుదారులు దాఖలు చేయాల్సిన దాదాపు అన్ని రిటర్నుల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ మేరకు పలు జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువును పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే విధంగా మార్చి 20, ఆ తర్వాత కాలపరిమితి ముగిసే ఈ–వే బిల్లులన్నింటి గడు వును కూడా ఆగస్టు 31 వరకు పొడిగించింది.

కాంట్రాక్టర్లకు ఊరట..
వాస్తవానికి జీఎస్టీ పరిధిలోనికి వచ్చే డీలర్లు (వ్యాపారులు) పన్ను చెల్లింపు కోసం రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. సదరు డీలర్ల వార్షిక టర్నోవర్‌ను బట్టి జనరల్‌ డీలర్‌ అయితే ప్రతి నెలా, కాంపోజిట్‌ డీలర్‌ అయితే మూడు నెలలకోసారి ఇలా పన్ను చెల్లింపుల కోసం రిట ర్నులు సమర్పించాలి. అమ్మకపు వివరాలను జీఎస్టీఆర్‌ 1 ద్వారా, అమ్మకాలు, కొను గోళ్ల వివరాలను జీఎస్టీఆర్‌ 3బీ ఫారాలను దాఖలు చేయడం ద్వారా ప్రభుత్వానికి తెలియ జేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కోవిడ్‌–19 ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ రిటర్నుల దాఖలు గడువును పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

దీని ప్రకారం జనరల్, కాంపోజిట్‌ డీలర్లు దాఖలు చేసే అన్ని రిటర్నుల గడువు జూలై 31 వరకు పొడిగించింది. అలాగే కాంట్రాక్టర్లకు ఊరట కలిగించేలా ప్రతి నెలకు మరుసటి నెల 10వ తేదీ వరకు సమర్పించాల్సిన టీడీఎస్‌ రిటర్నులను (మార్చి నుంచి జూన్‌ వరకు) ఆగస్టు 31 వరకు పెంచింది. ఇటు ఎన్నారైలు, టీసీఎస్, ఇన్‌ పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ రిటర్నులను కూడా అదే తేదీ వరకు పొడిగించింది. ఇక పనిలో పనిగా ఎలక్ట్రానిక్‌ వే బిల్లులు (ఈ–వే బిల్లులు) చెల్లుబాటయ్యే కాలపరిమితి కూడా పెంచింది. ఈ ఏడాది మార్చి 24లోపు జనరేట్‌ అయి అదే నెల 20 లేదా ఆ తర్వాత ముగిసే ఈ–వే బిల్లులను ఆగస్టు 31 వరకు చెల్లుబాటయ్యే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా