జామ రైతులకు చేదు అనుభవం

16 Jul, 2020 15:30 IST|Sakshi

కష్టాల సాగు

కోల్‌కతా : పండ్ల విక్రేతలు, రైతులనూ కరోనా మహమ్మారి వెంటాడుతోంది. కారుచౌకగా లభించే పండ్లనూ కొనేవారు లేక అయినకాడికి అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో.. పోషక విలువల్లో మేటిగా పేరొందిన జామపండు రూపాయికి ఒకటి లభిస్తున్నా కొనేవారు లేక రైతులు, పండ్ల విక్రేతలు ఆవేదన చెందుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు ఏడెనిమిది రూపాయలు పలికిన ఒక్కో జామ ఇప్పుడు కేవలం రూపాయికే అందుబాటులో ఉంది. రూపాయికి ఒక జామపండును అందిస్తున్నా ఎవరూ కొనకపోవడంతో ఒక్కోసారి పండ్లను రోడ్డుపైనే పారబోస్తున్నామని పండ్ల విక్రేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గిరాకీ లేక అరకొర రేటుకే పండ్లను తెగనమ్ముతున్నా ఆ ధరకూ ఏ ఒక్కరూ కొనకపోవడంతో జామ రైతులకు నష్టాలు ఎదురవుతున్నాయి.

దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన విమల్‌ సర్ధార్‌ (52) గత ఏడాది తనకున్న ఎకరం తోటలో జామ పంటను సాగుచేసి మంచి దిగుబడి సాధించాడు. జామ పండ్లను విక్రయించగా వచ్చిన డబ్బుతో రూ 60,000 అప్పు తీర్చాడు. ఈ ఏడాది కరోనా వైరస్‌తో పాటు తుపాను బీభత్సంతో పరిస్థితి తారుమారైందని అప్పు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదని వాపోయారు. తమకు ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పండ్ల రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. లాక్‌డౌన్‌, ఆంఫన్‌ తుపాన్‌తో పశ్చిమ బెంగాల్‌లో జామ సాగుదారులు, హోల్‌సేలర్లు తీవ్రంగా నష్టపోయారు. అన్‌లాక్‌ దశలో అడుగుపెట్టినా లోకల్‌ ట్రైన్స్‌ను అనుమతించపోవడంతో పండ్ల సరఫరాలూ దెబ్బతిన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో జామ పండ్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు.

చదవండి : ‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’

మరిన్ని వార్తలు