పులిని నిద్రలేపినందుకు రూ.51000 జరిమానా!

25 Apr, 2019 08:21 IST|Sakshi

జైపూర్‌: జూపార్క్‌కు వెళ్లినప్పుడు ఎన్‌క్లోజర్‌లోని జంతువులను చూడడంతో పిల్లలు ఊరుకోరు. వాటిని ఆట పట్టించేందుకు చిన్న చిన్న కర్రలు, రాళ్లతో కొడుతుంటారు. ఇలా చేయడం జంతువులకు ఇబ్బందికరంగా ఉంటుందనే విషయం బహుశా పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ పెద్దవాళ్లు కూడా ఇదే పనిచేస్తే తప్పు కదా! స్వేచ్ఛగా జీవించే హక్కు మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంది. ఆ స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వాటి హక్కును కాలరాసినట్టే. ఇప్పుడిదంతా ఎందుకంటే.. రాజస్థాన్‌లో ఓ టైగర్‌ రిజర్వ్‌ పార్క్‌లో నిద్రపోతున్న పులిని రాళ్లతో కొట్టి నిద్రలేపే ప్రయత్నం చేసినందుకు ఒక పర్యాటకుడికి, అతడి గైడ్‌కు 51,000 రూపాయల జరిమానా విధించారు. 

వివరాల్లోకెళ్తే..  జైపూర్‌ సమీపంలోని రాంతాంబోర్‌ టైగర్‌ రిజర్వ్‌(ఆర్‌టీఆర్‌)కు గైడ్‌తోపాటు ఓ పర్యాటకుడు వచ్చాడు. పార్క్‌లోని జోన్‌–6లో ఉన్న పిలిఘాట్‌ గేట్‌ నుంచి వీరు జిప్సీ వాహనంలో పార్క్‌లోకి ప్రవేశించారు. పార్క్‌ గురించి గైడ్‌ చెప్పే విషయాలు వింటూ తన కెమెరాలో పార్క్‌లోని ప్రదేశాలను జంతువులను ఫొటోలు తీస్తున్నాడు పర్యాటకుడు. ఇంతలో వాళ్లకు నిద్రపోతున్న ఓ పులి కనిపించింది. అయితే ఆ పులిని నిద్రలేపాలని అనుకున్నారు. వెంటనే కొన్ని రాళ్లు తీసుకొని పులి మీద విసిరారు. అయితే స్థానిక పులుల సంరక్షణాధికారి ఈ విషయాన్ని గమనించి పర్యాటకుడికి, గైడ్‌కు కలిపి 51,000 రూపాయల జరిమానా విధించారు. 

>
మరిన్ని వార్తలు