ఇష్రాత్ దోషులకు శిక్ష పడాల్సిందే: షిండే

4 Jul, 2013 16:45 IST|Sakshi
సుశీల్ కుమార్ షిండే

విద్యార్థిని ఇష్రాత్ జహాన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనని కేంద్ర హోంమంత్రి  సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. వాస్తవం వాస్తవమే. నేరస్థులను శిక్షించాల్సిందే అని పేర్కొన్నారు. ఇష్రాత్ జహాన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో అహ్మదాబాద్ కోర్టుకు సీబీఐ చార్జీషీటు దాఖలు చేయడంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ షిండే ఈవిధంగా స్పందించారు.
 

ఇష్రాత్ జహాన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో గుజరాత్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డెరైక్టర్ రాజీందర్‌కుమార్‌తో పాటు ఆ సంస్థకు చెందిన మరో ముగ్గురు అధికారులపై తగిన ఆధారాలు లేవని హోంమంత్రిత్వ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో షిండే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

గుజరాత్‌లో 2004లో 19 ఏళ్ల కాలేజీ విద్యార్థిని ఇష్రాత్ జహాన్‌ను గుజరాత్ పోలీసులు, రాష్ట్ర సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్‌ఐబీ) సంయుక్తంగా కుట్ర పన్ని బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్థానిక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో పేర్కొంది. పరారీలో ఉన్న అదనపు డీజీపీ పి.పి.పాండే, సస్పెన్షన్‌కు గురైన డీఐజీ డి.జి.వంజరలతో పాటు ఏడుగురు గుజరాత్ పోలీసు అధికారులపై.. నేరపూరిత కుట్ర, అపహరణ, చట్టవ్యతిరేక నిర్బంధం, హత్య అభియోగాలు మోపింది.

మరిన్ని వార్తలు