జల్లికట్టుకు ‘గిన్నిస్‌’లో చోటు

21 Jan, 2019 03:41 IST|Sakshi
నిర్వాహకులకు గిన్నిస్‌ రికార్డు సర్టిఫికెట్‌ అందజేస్తున్న ప్రతినిధులు

ఒకేసారి రంగంలోకి 1,354 ఎద్దులు, 424 మంది క్రీడాకారులు

ఇద్దరు మృతి, 31 మందికి గాయాలు

సాక్షి, చెన్నై: తమిళుల సాహసక్రీడ జల్లికట్టు గిన్నిస్‌ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. ఆదివారం పుదుకోట్టై జిల్లా విరాళిమలైలో జరిగిన జల్లికట్టుకు గిన్నిస్‌ ప్రతినిధులు హాజరై నిర్వాహకులకు సర్టిఫికెట్‌ అందజేశారు. అయితే, ఈ క్రీడ తిలకించేందుకు వచ్చిన ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఎద్దులను అదుపులోకి తెచ్చేందుకు యత్నించి 31 మంది గాయాలపాలయ్యారు. గిన్నిస్‌ రికార్డుల్లో చోటు సంపాదించాలన్న ప్రయత్నంలో భాగంగా విరాళి మలైలో జల్లికట్టుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. 1,354 ఎద్దులను రంగంలోకి దించిన నిర్వాహకులు వీటిని పట్టుకునేందుకు మాత్రం 424 క్రీడాకారులనే అనుమతించారు.

తొలుత 2,000కుపైగా ఎద్దులను బరిలోకి దించాలని భావించినప్పటికీ సమయాభావం కారణంగా కుదరలేదు. పోటీలో ఎద్దుల సంఖ్య ఎక్కువ, పాల్గొనేవారి సంఖ్య తక్కువ కావడంతో క్రీడాకారులతో పాటు సందర్శకులకు కూడా వైద్య బీమా కల్పించారు. ఎద్దులతో జరిగిన పోరులో దాదాపు 31 మంది గాయపడ్డారు. తిలకించేందుకు వచ్చిన వారిపైకి ఎద్దులు దూసుకు పోవడంతో రాము(25), సతీష్‌(43) అనే వారు ప్రాణాలు కోల్పోయారు. బసవన్నలను అదుపు చేసిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కాగా, భారీ ఎత్తున జరిగిన ఈ కార్యక్రమానికి గిన్నిస్‌ రికార్డు దక్కినందుకు లభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు