ఆనందీ బెన్ రాజీనామా ఆమోదం

3 Aug, 2016 17:50 IST|Sakshi

అహ్మదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ రాజీనామాకు రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీ ఆమోదం తెలిపారు. ఆనందీ బెన్ బుధవారం సాయంత్రం గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. కాగా గుజరాత్ కొత్త సీఎం అభ్యర్థి ఎంపిక గురువారం ఖరారు కానుంది. ఇందుకోసం పార్టీ పరిశీలకులుగా నితిన్ గడ్కరీ, సరోజ్ పాండే గుజరాత్ వెళ్లనున్నారు. మరోవైపు సీఎం రేసులో పలువురు ముఖ్యనేతల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. గుజరాత్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయ్ రూపానీ, సౌరభ్ పటేల్ పేర్లు ముందంజలో ఉన్నాయి.

ఇక నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో ఆనందీ బెన్ 2014లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల రాష్ట్రంలో రాజకీయంగా పలు సవాళ్లతో సతమతమవుతున్న సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తన వయసు 75 ఏళ్లకు చేరుతున్నందున ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానంటూ రెండు నెలల కిందటే పార్టీ నాయకత్వానికి తాను లేఖ రాశానని ఆనందీబెన్ సోమవారం ఫేస్‌బుక్‌లో తెలిపారు.

>
మరిన్ని వార్తలు