రాహుల్‌ పై దాడిని ఖండించిన గుజరాత్‌ సీఎం..

5 Aug, 2017 12:28 IST|Sakshi
రాహుల్‌ పై దాడిని ఖండించిన గుజరాత్‌ సీఎం..
అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై జరిగిన దాడిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌రూపాణి ఖండించారు. దురదృష్టకరమైన దాడిగా అభివర్ణిస్తూ దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం డీజీ ర్యాంకు హోదా కలిగిన అధికారిని విచారణ అధికారిగా నియమించిందని, ఘటనకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్‌ రూపాణి ఘటనానంతరం ట్వీట్‌ చేశారు. 
 
వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వాహనంపై శుక్రవారం రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రాహుల్‌ కారు అద్దాలు పగిలిపోగ,. ప్రత్యేక భద్రత దళం(ఎస్‌పీజీ) వెంటనే అప్రమత్తమవటంతో ఆయన ఎలాంటి గాయాల్లేకుండానే క్షేమంగా బయటపడ్డారు.
 
పిరికిపందల చర్యలకు తాను భయపడనని రాహుల్‌ అన్నారు. అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ ఘటనలపై మండిపడింది. బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని విమర్శించింది. కాంగ్రెస్‌ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్‌ అవకాశవాద రాజకీయాలకు విసిగి ప్రజలే  దాడి చేశారని పేర్కొంది. అంతకు ముందు రూపానీ రాహుల్‌ పర్యటను ఉద్దేశించి కఠిన పరిస్థితుల్లో కాంగ్రేస్‌ ఎమ్మెల్యేలు ఎక్కడా అని ప్రజలు రాహుల్‌ నిలదీస్తారని, పార్టీ కోసం రాహుల్‌ కృషి చేస్తుంటే గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సేదతీరుతున్నారని ట్వీట్‌ చేశారు. గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరు క్యాంపులో ఉన్న విషయం తెలిసిందే.
 
మరిన్ని వార్తలు