22 కి.మీ... లక్ష మంది

21 Feb, 2020 03:05 IST|Sakshi
అహ్మదాబాద్‌లో మొటెరా స్టేడియం వద్ద మోహరించిన పోలీసులు

అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రోడ్‌షోకు ముమ్మర ఏర్పాట్లు

మొటెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’కార్యక్రమం 

ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న మెలానియా

సర్వాంగ సుందరంగా ఆగ్రా

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ గాంధీనగర్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 24న ట్రంప్, ప్రధాని మోదీ అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి 22 కిలోమీటర్ల మేర నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. ప్రస్తుతం ఉన్న ప్రణాళిక ప్రకారం స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్, మోదీలు సందర్శిస్తారు. తర్వాత ఆశ్రమం నుంచి ఇందిర బ్రిడ్జి పైనుంచి ఎస్పీ రింగు రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు వద్దనున్న మొటెరా స్టేడియంకు చేరుకుంటారు. రోడ్‌షోలో భద్రతా ఏర్పాట్లూ, ట్రాఫిక్‌ తదితర అంశాలు సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గుజరాత్‌ హోంమంత్రి ప్రదీప్‌సిన్హా జడేజా చెప్పారు.

రోడ్‌ షోకి ఒక లక్ష మంది
రోడ్‌షోలో సుమారు లక్ష మంది ప్రజలు భాగస్వాములవుతారని భావిస్తున్నారు. రోడ్‌షోలో 70 లక్షల మంది జనం పాల్గొంటున్నారని ట్రంప్‌ చెప్పారు. అయితే లక్ష మంది వరకు రోడ్‌షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌ నెహ్రా వెల్లడించారు. మొటెరాలో కొత్తగా నిర్మిస్తోన్న క్రికెట్‌ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సభను ఉద్దేశించి ఇరువురు నేతలూ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు లక్షా పదివేల మంది ప్రజలు పాల్గొననున్నారు.

సర్వాంగ సుందరంగా ఆగ్రా
తాజ్‌మహల్‌ని ట్రంప్, ఆయన భార్య మెలానియా దర్శించనున్న నేపథ్యంలో తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాలను యూపీ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. తాజ్‌మహల్, పరిసర ప్రాంతాలనూ ముస్తాబు చేస్తున్నారు. తాజ్‌మహల్‌ పక్కనున్న యమునా తీర ప్రాంతంలోని భారీచెత్తను గత రెండు రోజులుగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఖెరియా ఎయిర్‌పోర్టు నుంచి తాజ్‌మహల్‌ వరకు ఎంజీ రోడ్డుపైన భిక్షాటన చేసేవారిని అక్కడి నుంచి ఖాళీచేయించారు. దారిపొడవునా గోడలకు రంగులు వేశారు. భద్రతాకారణాల రీత్యా దారిలో ఉన్న చెట్లను నరికివేశారు. 20వేల మంది విద్యార్థులు జెండాలతో స్వాగతం పలుకుతారు. రామ్‌లీలా, రాస్‌లీలా, పంచకుల, నౌతంకి సహా ఆగ్రా, మధుర, బృందావన్‌ల నుంచి కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.

ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న మెలానియా
మెలానియా దక్షిణ ఢిల్లీలో ఆప్‌ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రవేశపెట్టిన ‘హ్యాపీనెస్‌ కరికులమ్‌’ పాఠశాలను సందర్శించనున్నారు. 25న ఢిల్లీకి చేరుకోనున్న ట్రంప్, మెలానియాలకు సీఎం కేజ్రీవాల్‌ స్వాగతం పలుకుతారు. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించేందుకు గతంలో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ‘హ్యపీనెస్‌’ పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టారు. ఇందులో 40 నిముషాల పాటు మెడిటేషన్, విశ్రాంతి తదితర కార్యక్రమాలుంటాయి.

రోడ్‌ షోకు డీఆర్‌డీఓ డ్రోన్‌ నిరోధక వ్యవస్థ
ట్రంప్, మోదీ పాల్గొనే రోడ్‌ షోలో డీఆర్‌డీఓ(డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) అభివృద్ధి చేసిన డ్రోన్‌ నిరోధక వ్యవస్థను వాడనున్నారు. అగ్రనేతల భద్రత కోసం స్థానిక పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్, చేతక్‌ కమాండో, స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ల సేవలను వినియోగించుకుంటున్నారు. రోడ్‌ షో జరిగే ప్రాంతంలోని కీలక, వ్యూహాత్మక ప్రదేశాల్లో వీరిని మోహరిస్తామని క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అజయ్‌ తోమర్‌ గురువారం తెలిపారు. డ్రోన్‌ను గుర్తించడంతో పాటు, దాన్ని నాశనం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. రోడ్‌ షో సందర్భంగా ఇరువురు నేతలు ఒకే కారులో ప్రయాణిస్తారా? అన్న విషయంపై తమకు సమాచారం లేదని తోమర్‌ తెలిపారు. అలాగే, ఓపెన్‌ వెహికిల్‌ను వారు వాడకపోవచ్చన్నారు.


ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో తాజ్‌మహల్‌ పరిసరాలను ముస్తాబుచేస్తున్న దృశ్యం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు