‘పిల్ల’ దొరికిందని 1.55లక్షలు అప్పు ఇస్తే..

13 Jun, 2020 15:58 IST|Sakshi

పెళ్లైన నెల రోజులకే వధువు పరార్‌

అహ్మదాబాద్‌ : జయేష్ రాథోడ్.. చాలా సంతోష పడ్డాడు. చాలా కాలానికి వధువు దొరికిందని ఆనందంతో చిందులేశాడు. ఇక ఎవరూ తనను ‘పెళ్లి కాని జయేష్‌’ అనబోరని సంబరపడ్డాడు. పెళ్లి ఖర్చులకు డబ్బులు లేవంటే తానే 1.55 లక్షల అప్పు ఇచ్చాడు. అనుకున్నట్లే పెళ్లి అయింది కానీ.. ఆ ఆనందం మాత్రం నెల రోజులకే పరిమితమైంది. పెళ్లి అయిన నెలరోజలకే వధువు ఇంట్లో నుంచి పారిపోయింది. చివరకు తాను మోసపోయాయని  తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఆహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతానికి చెందిన జయేశ్(32)‌.. ఓ వస్త్ర కర్మాగారంలో దుస్తులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సొంతిళ్లు కూడా లేదు. వయసు పెరిగిపోవడం, సొంతిళ్లు లేకపోవడంతో పెళ్లి చేసుకోవడానికి జయేశ్‌కు వధువు దొరకలేదు. బంధువులు కూడా పిల్లనివ్వడానికి వెనుకాడారు. దీంతో తనకు తెలిసిన బంధువులు వేరే కులానికి చెందిన అమ్మాయిని చూశారు. ఇరువురు ఇష్టపడడంతో పెళ్లి చేయడానికి నిర్ణయించారు.

పెళ్లికి తాము సిద్దమే కానీ, ఖర్చులకు డబ్బులు లేవని వధువు కుటుంబ సభ్యులు చెప్పడంతో జయేశ్‌.. తన దగ్గర ఉన్న రూ.1.55లక్షలను అప్పుగా ఇచ్చాడు. ఐదు నెలల్లో తీసుకున్న అప్పు తిరిగి ఇస్తామని వధువు సోదరుడు సంజిత్‌ హామీ ఇచ్చారు. ఆగస్టులో జయేష్‌, కళావతిల వివాహం జరిగింది. నెల రోజుల తర్వాత కళావతి ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో జయేశ్‌ ఈ విషయాన్ని సోదరుడి దృష్టికి తీసుకెళ్లి, అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని కోరగా.. సంజిత్‌ నిరాకరించాడు. డబ్బులు ఇవ్వబోమని, మరోసారి డబ్బులు ఇవ్వమని అడిగితే చంపేస్తామని బెదిరించినట్లు జయేశ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 

>
మరిన్ని వార్తలు