హెల్మెట్‌ లేకున్నా.. ఒక్క రూపాయి కట్టలేదు..!

18 Sep, 2019 11:26 IST|Sakshi

అహ్మదాబాద్‌ : నూతన మోటారు వాహన చట్టంతో జనం బెంబేలెత్తుతున్నారు. భారీ చలాన్లకు భయపడి వాహనాలతో రోడ్లపైకి రావాలంటేనే జడుసుకుంటున్నారు. అయితే, ఉదయ్‌పూర్‌ జిల్లాలోని బొడేలిలో నివాముండే జకీర్‌ మోమన్‌ అనే వ్యక్తి మాత్రం హెల్మెట్‌ లేకుండానే యథేచ్ఛగా బైక్‌పై తిరుగుతున్నాడు. దీంతో ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు అతన్ని పట్టుకుని భారీ ఫైన్‌ వేశారు. కానీ, అతను జరిమానా చెల్లించేందుకు నిరాకరించాడు. ఆ చుట్టుపక్కల పట్టణాలన్నీ వెతికినా తన తలకు సరిపడా హెల్మెట్‌ దొరకడం లేదని పోలీసుల ఎదుట వాపోయాడు. దయుంచి తన భారీ తలకు ఓ హెల్మెట్‌ జాడ చెప్పండని వేడుకున్నాడు. కావాలంటే చెక్‌ చేసుకోండని అక్కడున్న హెల్మెట్లు పెట్టుకుని చూశాడు. ఒక్కటి కూడా అతని తలకు సరిపోలేదు. భారీ తల కారణంగానే హెల్మెట్‌ లేకుండా తిరుగుతున్నానని.. తనకు ఫైన్‌ వేయొద్దని పోలీసులకు విన్నవించాడు.
(చదవండి : ట్రాఫిక్‌ జరిమానాలు సగానికి తగ్గించారు)

జకీర్‌ వాహనానికి మిగతా అన్ని పేపర్లు సక్రమంగా ఉండటంతో అతనికి ఎలాంటి ఫైన్‌ వేయకుండా ట్రాఫిక్‌ పోలీసులు వదిలేశారు. ఇదిలాఉండగా.. నూతన మోటారు వాహన సవరణ చట్టంపై తీవ్ర విమర్శలు రావడంతో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలుచేస్తూనే.. అందులోని జరిమానాలను సగానికి సగం తగ్గిస్టున్న ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని ప్రకటించారు. ఇక గుజరాత్‌ బాటలోనే కర్ణాటక ప్రభుత్వం నడిచే యోచనలో ఉన్నట్టు తెలిసింది. గుజరాత్‌ తరహాలో ట్రాఫిక్‌ చలాన్లు తగ్గిస్తామని సీఎం బీఎస్‌ యడ్యూరప్ప మీడియాతో  అన్నారు.
(చదవండి : ట్రాఫిక్‌ చలాన్లను తగ్గించనున్న మరో రాష్ట్రం!)

మరిన్ని వార్తలు