గుజరాత్ అల్లర్ల వల్లే ఐఎం ఆవిర్భావం : కాంగ్రెస్ ఆరోపణ

22 Jul, 2013 06:18 IST|Sakshi
గుజరాత్ అల్లర్ల వల్లే ఐఎం ఆవిర్భావం : కాంగ్రెస్ ఆరోపణ

గుజరాత్ అల్లర్లు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఏర్పడటానికి కారణమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ గర్హించింది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా మతం కార్డును ప్రయోగిస్తున్నారని నిందించింది. గుజరాత్ మత ఘర్షణల అనంతరం ఐఎం ఏర్పాటైనట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు కూడా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మత రాజకీయాలకు దూరంగా ఉండటం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అవి మత రాజకీయాలు విడనాడితే ఉగ్రవాద సంస్థలు మనుగడ కోల్పోతాయని ఆ తర్వాత పీటీఐతో వ్యాఖ్యానించారు. ఇవి తెలివితక్కువ, గర్హనీయమైన ఆరోపణలంటూ బీజేపీ తిప్పికొట్టింది. ఆ సంస్థలకు పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలు సుస్పష్టమేనని, 2002కు ముందు కూడా దేశంలో ఉగ్రవాద సంస్థలు చురుగ్గా ఉన్నాయని పేర్కొంది. నైరాశ్యంలో మునిగిపోయిన కాంగ్రెస్సే రాజకీయాలకు మతం రంగు పులిమేం దుకు ప్రయత్నిస్తోందని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. అస్తవ్యస్త మారిన పాలన, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలకు ఆ పార్టీ వద్ద సమాధానం లేదని అన్నారు. గుజరాత్‌లో గత పదేళ్లుగా శాంతి విలసిల్లుతోందని, ముస్లింలు పురోభివృద్ధి సాధిస్తున్నారని చెప్పారు. బీజేపీ మరో నేత వెంకయ్య నాయుడు కూడా కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు.

మరిన్ని వార్తలు