పబ్‌జీ మాయలో పడిన టీనేజీ తల్లి..

18 May, 2019 17:21 IST|Sakshi

అహ్మదాబాద్‌ : ప్రస్తుతం పబ్‌జీ ట్రెండ్ నడుస్తోంది. చిన్నా పెద్దా తేడాల్లేకుండా ఈ గేమ్‌ మాయలో పడి గంగవెర్రులెత్తుతున్నారు. ప్రాణాలు తీయడంతో పాటుగా పచ్చని సంసారాల్లోనూ పబ్‌జీ చిచ్చు పెడుతోంది. గుజరాత్‌లోని ఓ టీనేజీ తల్లి వ్యవహారశైలి ఇందుకు తార్కాణంగా నిలిచింది.​ వివరాలు...గుజరాత్‌కు చెందిన ఓ పద్దెమినిదేళ్ల యువతికి బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌తో పెళ్తైంది. ప్రస్తుతం ఆమెకు నెలల వయస్సున్న కూతురు ఉంది. కాగా గత కొంతకాలంగా పబ్‌జీ గేమ్‌కు బానిసైన సదరు వివాహిత తనకు సహాయం కావాలంటూ ప్రభుత్వ సంస్థ అభయం హెల్ఫ్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసింది. తాను పబ్‌జీ భాగస్వామితో జీవితం పంచుకోవాలనుకుంటున్నానని, అప్పుడు ఇద్దరం కలిసి గేమ్‌ ఆడుకోగలమని పేర్కొంది. ఇందుకోసం తన భర్తతో విడాకులు ఇప్పించాల్సిందిగా కోరింది. దీంతో కంగుతిన్న కౌన్సిలర్‌ కొంతకాలం అహ్మదాబాద్‌లోని సహాయక శిబిరంలో ఉంటే పరిస్థితులు చక్కబడతాయని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ ఫోన్లు అనుమతించని కారణంగానే తాను సహాయక శిబిరానికి వెళ్లనని వివాహిత తేల్చిచెప్పింది.

ఈ విషయం గురించి అభయం ప్రాజెక్టు హెడ్‌ మాట్లాడుతూ..‘మాకు రోజుకు సుమారు 550 కాల్స్‌ వస్తాయి. కానీ ఇంతకుముందెవరూ ఇలాంటి సహాయం కోరలేదు. నిజానికి తమ పిల్లలు పబ్‌జీకి బానిసలుగా మారారంటూ చాలా మంది తల్లులు గోడు వెళ్లబోసుకుంటారు. కానీ ఇక్కడ తల్లే పబ్‌జీకి బానిసైంది. ఆట కోసం తన భర్త, కూతురిని భారంగా భావిస్తోంది. ఆమె ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని పేర్కొన్నారు. కాగా పబ్‌జీ ఆడొద్దన్న కారణంగా ఇటీవల యూఏఈ మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు