తప్పు చేస్తే.. ‘మొక్క’ల్సిందే!

24 Aug, 2019 09:18 IST|Sakshi

సూరత్‌: విద్యార్థులు ఏ చిన్న తప్పు చేసినా... ఆఖరికి యూనిఫామ్‌ వేసుకు రాకపోయినా దారుణంగా దండించే స్కూళ్లను మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే గుజరాత్‌లోని వీర్‌ నర్మాద్‌ సౌత్‌ గుజరాత్‌ యూనివర్సిటీ వినూత్నమైన శిక్షలు వేస్తోంది. ఇక్కడి ఓ ప్రొఫెసర్‌కు వచ్చిన ఆలోచన ఫలితంగా... విద్యార్థులు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడల్లా వారి చేత ఓ మొక్కను నాటించేలా శిక్ష విధిస్తున్నారు. దీంతో గత ఎనిమిదేళ్లలో ఈ వర్సిటీలో 550కి పైగా చెట్లు వచ్చాయి. వర్సిటీలోని ఆర్కిటెక్చర్‌ విభాగంలో ‘బేసిక్‌ డిజైన్‌’ సబ్జెక్టును బోధిస్తున్న ప్రొఫెసర్‌ మెహుల్‌ పటేల్‌ (36) ఈ వినూత్న పద్ధతికి తెరలేపారు. క్లాసులకు లేటుగా రావడం, అసైన్‌మెంట్లు చేయకపోవడం, క్లాసులో ఫోన్‌ వాడడం వంటి చిన్న చిన్న తప్పులకు మొక్కలను నాటడాన్ని శిక్షగా విధిస్తున్నారు. పచ్చదనం పెరగడం సంతోషాన్నిస్తోందని చెబుతున్నారు విద్యార్థులు.

‘పర్యావరణానికి నా వంతుగా ఏదోటి చేయాలన్న ఆలోచనతో ఈ పద్ధతిని అమలు చేస్తున్నాను. విద్యార్థులు చేసిన చిన్న చిన్న తప్పులకు మొక్కలు నాటిస్తున్నాను. 8 ఏళ్లలో క్యాంపస్‌లో 550పైగా మొక్కలు నాటించాను. ముందుగా నాటిన మొక్కలు 20 మీటర్లు ఎత్తు వరకు పెరిగాయి. మొక్క నాటడంతో  అయిపోదు. దాన్ని కాపాడేందుకు నీళ్లు పోయడం, ఎరువులు వేయడం చేస్తుంటాం. ఇప్పుడు మా డిపార్ట్‌మెంట్‌ సమీపంలో పచ్చదనం బాగా పెరగడంతో పక్షులు, సీతాకోక చిలుకలు, తేనెటీగల సందడి చేస్తున్నాయ’ని ప్రొఫెసర్‌ పటేల్‌ తెలిపారు. మొక్కలకు నీళ్ల కోసం విద్యార్థులు చిన్న కుంట కూడా తవ్వారని వెల్లడించారు. ఈ ప్రొఫెసర్‌ను చూసి మన ‘దండో’పాధ్యాయులు చాలా నేర్చుకోవాలేమో!!.

మరిన్ని వార్తలు