రైలు పట్టాలపైనే టెంట్‌ వేసి ఆందోళన

9 Feb, 2019 11:38 IST|Sakshi

గుజ్జర్ల ఆందోళనతో 15 రైళ్లు రద్దు, 5 రైళ్లు దారి మళ్లింపు

ఢిల్లీ/రాజస్థాన్ : రిజర్వేషన్ల కోసం గుజ్జర్ల ఆందోళన రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపింది. గుజ్జర్ల ఆందోళన నేపథ్యంలో 15 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా, మరో అయిదు రైళ్లను దారి మళ్లించింది. రాజస్థాన్‌ ప్రభుత్వం   అయిదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ గుజ్జర్లు రైలు పట్టాలపై టెంట్లు వేసి నిరసన తెలుపుతున్నారు. విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు డిమాండ్‌ చేస్తూ గుజ‍్జర్లు నిన్నటి నుంచి స‌వాయి మాదోపూర్ జిల్లాలో మ‌ల‌ర్నా దుంగార్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ట్రాక్‌ల‌పై టెంట్లు వేసుకుని ధర్నాకు దిగారు. దీంతో  వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలో కొన్ని రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రద్దు అయ్యాయి. ఐదు శాతం రిజర్వేషన్‌ కోసం తాము చాలా కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము తిరిగి ఆందోళన చేపట్టామని, తమ కోటాను ప్రభుత్వం ఎలాగైనా ఇచ్చి తీరాల్సిందేనని గుజ్జర్ల నేత కిరోరి సింగ్‌ భైంస్లా స్పష్టం చేశారు. 

కాగా ప్రస్తుతం గుజ్జర్లు సహా గొదియా లొహర్‌, బంజారా, రైకా, గదారియా కులాల వారికి 50 శాతం కోటాలోనే అత్యంత వెనుకబడిన వర్గాల కింద ప్రత్యేకంగా ఒక శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. అయితే తమ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్ధల్లో ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గుజ్జర్లు జనవరిలో రాజస్ధాన్‌ సర్కార్‌కు ఇరవై రోజుల గడువిస్తూ అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్‌లైన్‌ ముగియడంతో సవాయి మధోపూర్‌ జిల్లాలో గుజ్జర్లు ఆందోళన బాట పట్టారు.

మరిన్ని వార్తలు