12 ఏళ్లుగా గుజ్జర్ల ఆందోళన

13 Feb, 2019 16:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగ రంగాల్లో తమకూ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ గత ఐదు రోజులుగా రాజస్థాన్‌లోని మలర్నా రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపై గుజ్జర్లు ఆందోళన చేస్తున్నా రాష్ట్రంలోని అశోక్‌ గెహ్లాట్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ? గుజ్జర్లకు తప్పకుండా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామంటూ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుజ్జర్ల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? 2006 నుంచి, అంటే పన్నెండేళ్లుగా గుజ్జర్లు ఆందోళన చేస్తున్నా వారి డిమాండ్‌ ఇప్పటి వరకు ఎందుకు నెరవేరలేదు?

ఎస్టీల్లాగా తమకు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ 2006లో కరౌలి ప్రాంతంలోని రైలు పట్టాలపై పదవీ విరమణ చేసిన సైనికుడు కిరోరి సింగ్‌ భైన్సాలా నాయకత్వాన గుజ్జర్లు ఆందోళన చేశారు. అప్పుడు ఎలాంటి ఫలితం రాలేదు. వారు ఆ మరుసటి సంవత్సరం కూడా రైలు పట్టాలపై  ఆందోళన చేయగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో 26 మంది గుజ్జర్లు చనిపోయారు. అప్పుడు గుజ్జర్ల డిమాండ్‌ను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ జస్రాజ్‌ చోప్రా ఆధ్వర్యాన ఓ కమిటీని వేసింది. ఇతర వెనకబడిన వర్గాల వారికి కేటాయించిన 21 శాతం రిజర్వేషన్ల కారణంగా గుజ్జర్లు లబ్ధి పొందుతున్నందున వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు అవసరం లేదని తేల్చింది.

ఎస్టీల కింద రిజర్వేషన్లు కల్పించడం కుదరకపోతే ప్రత్యేక వెనకబడిన తరగతుల కేటగిరీ కింద ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ భైన్సాలా మళ్లీ 2008 రైలు రోకో ఆందోళన చేపట్టారు. అప్పుడు కూడా అది హింసాత్మకంగా మారడంతో  ఓ పోలీసు సహా 36 మంది మరణించారు. 2010లో ఇదే అశోక్‌ గెహ్లాట్, బైన్సాలాతో చర్చలు జరిపి గుజ్జర్లకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించారు. దాంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు యాభై శాతానికి చేరుకోవడంతో అంతకుమించి ఆయన రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారు. తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కావాల్సిందేనంటూ గుజ్జర్లు 2015లో మరోసారి రైలు రోకో ఆందోళన చేపట్టారు. దాంతో అప్పటి వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక వెనకబడిన తరగతుల చట్టాన్ని తీసుకొచ్చింది. రిజర్వేషన్లు అప్పటికే యాభై శాతం ఉన్నాయన్న కారణంగా ఆ చట్టాన్ని రాజస్థాన్‌ హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత వారిని మెప్పించేందుకు 2017లో వసుంధర రాజె ప్రభుత్వం ఇతర వెనకబడిన తరగతుల రిజర్వేషన్లను 21 శాతం నుంచి 26 శాతానికి పెంచుతూ చట్టం తెచ్చింది. దాన్నీ హైకోర్టు కొట్టివేసింది.

మొన్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుజ్జర్లకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సచిన్‌ పైలట్‌ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. గుజ్జర్లతోపాటు మరికొన్ని సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో 20 రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించాలంటూ గెహ్లాట్‌ ప్రభుత్వానికి భైన్సాలా అల్టిమేటం జారీ చేశారు. 20 రోజుల గడువు కాలం పూర్తవడంతో ఐదు రోజుల క్రితం గుజ్జర్లు మళ్లీ ఆందోళన చేపట్టారు.

ఇప్పటికే దేశంలో యాభై శాతం రిజర్వేషన్లు మించిపోయినప్పటికీ దేశంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చినప్పుడు తమ డిమాండ్‌ను మాత్రం ఎందుకు నెరవేర్చలేదని ‘గుజ్జార్‌ అరక్షన్‌ సంఘర్ష్‌ సమితి’ ప్రధాన కార్యదర్శి షైలేంద్ర సింగ్‌ ప్రశ్నిస్తున్నారు. గుజ్జర్ల విషయంతో తామేమి చేయలేమని, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని గెహ్లాట్‌ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు ఈ విషయాన్ని తన మేనిఫెస్టోలో పేర్కొందని బీజేపీ ప్రశ్నిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి సిఫార్సు చేయాల్సిందిగా ప్రస్తుతం గెహ్లాట్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

మరిన్ని వార్తలు