కొంటానని చెప్పి...కొట్టేసాడు

19 Jun, 2018 14:20 IST|Sakshi

హరియానా : బైక్‌ కొంటానని చెప్పి కొంత సొమ్ము అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు...టెస్ట్‌ రైడ్‌ చేస్తానని అడిగాడు. సరేలే ఎలాను అడ్వాన్స్‌ ఇచ్చాడు కదా అని టెస్ట్‌ రైడ్‌కు ఒప్పుకున్నాడు బైక్‌ యజమాని. టెస్ట్‌ రైడ్‌కని చెప్పి వెళ్లిన వాడు ఎంతకూ తిరిగి రాలేదు. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న బైక్‌ యజమాని పోలీసులను ఆశ్రయించాడు.

వివరాల ప్రకారం...గుర్గావ్‌కు చెందిన అజయ్‌ సింగ్‌ తన హార్లీ డేవిడ్సన్ బైక్‌ను విక్రయించాలనుకుని, అమ్మకాలు - కొనుగోళ్లు జరిపే ఒక ఆన్‌లైన్‌ సైట్‌లో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసిన ఒక అపరిచిత వ్యక్తి అజయ్‌ సింగ్‌కు ఫోన్‌ చేసి తనను తాను ఆగ్రా రాహుల్‌ నగర్‌కు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. తాను మార్బుల్‌ బిజినెస్‌ చేస్తున్నానని, ఆన్‌లైన్‌ సైట్‌లో పెట్టిన హార్లీ డేవిడ్సన్ బైక్‌ను కొనాలనుకుంటున్నానని తెలిపాడు. అజయ్‌ సింగ్‌కు ఫోన్‌ చేసిన ప్రతి సారి మోటార్‌ బైక్‌ల గురించి బాగా తెలిసిన నిపుణుడిగా మాట్లాడేవాడు. అలా అతనిపై ఏ మాత్రం అనుమానం రాకుండా.. అజయ్‌సింగ్‌ను బుట్టలో వేసుకున్నాడు.

ఏడు వేల రూపాయలు అడ్వాన్స్‌ కూడా చెల్లించాడు. అడ్వాన్స్‌ చెల్లించిన తర్వాత ఒకసారి బైక్‌ను స్వయంగా పరిశీలిస్తానని కోరాడు. అజయ్‌ సింగ్‌ అందుకు ఒప్పుకుని ఆ వ్యక్తిని గుర్గావ్‌లో ఉన్న హార్లీ డేవిడ్‌సన్‌ షోరూం వద్దకు రమ్మని చెప్పాడు. ఆ వ్యక్తి అజయ్‌ సింగ్‌ను కలిసిన తర్వాత ఇద్దరూ కాసేపు చర్చించుకుని బైక్‌ ఖరీదును 7 లక్షల రూపాయలుగా నిర్ణయించుకున్నారు. డబ్బు చెల్లించడానికి కంటే ముందు తాను ఒక సారి బైక్‌ను టెస్ట్‌ రైడ్‌ చేస్తానని అజయ్‌ సింగ్‌ను అడిగాడు.

అందుకు అజయ్‌ సింగ్‌ ఒప్పుకుని బైక్‌ తాళాలను ఆ వ్యక్తికి ఇచ్చాడు. టెస్ట్‌ రైడ్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకి రాకపోయేసరికి అజయ్‌ సింగ్‌ అతని నంబర్‌కు కాల్‌ చేశాడు. కానీ ఫోన్‌ స్విచాఫ్‌ అని వచ్చింది. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న అజయ్‌ సింగ్‌ పోలీసులను ఆశ్రయించాడు. అజయ్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు షోరూమ్‌ సీసీటీవీ ఫూటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు