కాలు కాలిన పిల్లిలా బాబా గుర్మీత్‌..

16 Sep, 2017 15:25 IST|Sakshi
కాలు కాలిన పిల్లిలా బాబా గుర్మీత్‌..

సాక్షి, న్యూఢిల్లీ: డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ దాదాపు 20 రోజులుగా రోహతక్‌లోని సునేరియా జైల్లో ఒంటరి జీవితం అనుభవిస్తున్నారు. భోగ విలాసాలకు దూరమవడంతో నిద్ర పట్టక జైలు గదిలో ఒంటరిగా కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారని జైలు అధికారులు తెలిపారు. గుర్మీత్‌పై దాఖలైన రెండు హత్య కేసుల్లో శనివారం నాడు  చండీఘర్‌ సమీపంలోని పంచకుల కోర్టులో విచారణ జరిగినప్పటికీ భద్రతా కారణాల రీత్య ఆయన్ని కోర్టుకు తీసుకెళ్లలేదు. జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తన వాదనను వినిపించుకునేందుకు అవకాశం కల్పించినట్లు జైలు అధికారులు తెలిపారు.  

ఎప్పుడూ 40 మోటారు వాహనాల వరుస ముందుగా కదులుతుంటే, తన వెనకాల వందలాది మంది శిష్యబృందం కదిలివస్తుండగా, రాజసం ఉట్టిపడే విధంగా స్వయంగా కారును నడుపుకుంటూ వెళ్లే గుర్మీత్‌ సింగ్‌కు ఎంత గతి పట్టిందని తోటి ఖైదీలే అనుకుంటున్నారు. తోటీ ఖైదీలు దాడి చేస్తారన్న భయంతో గుర్మీత్‌ జైల్లో వారితో మాట్లాడడం లేదట. పొద్దస్తమానం గదిలో తనలో తాను గొనుక్కుంటూ గడుపుతున్న గుర్మీత్‌ అసహనంతో గదిలో అస్తమానం అటూ ఇటూ నడుస్తున్నాడట. ఆయన్ని జైల్లో సందర్శించే వారి జాబితాలో గుర్మిత్‌ తల్లి నసీబ్‌ కౌర్, కూతుళ్లు, చరణ్‌ప్రీత్, అమన్‌ప్రీత్, కుమారుడు జస్మీత్‌ ఇన్సాన్, మరో పెంపుడు కూతురు హనీప్రీత్‌ల పేర్లు ఉండగా, ఇప్పటి వరకు ఆయన తల్లి నసీబ్‌ కౌర్‌ ఒక్కరే జైలుకు వచ్చి ఆయన్ని పలకరించి పోయారు.

డేరా సచ్ఛా సౌధాలో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా? అన్న ఒక్క విషయాన్నే బాబా తన తల్లిని వాకబుచేసి తెలుసుకున్నట్లు తెల్సింది. బాబా జైల్లోకి అడుగుపెట్టిన కొత్తలో తన పెంపుడు కూతురు హనీప్రీత్‌ను కలుసుకోవాలని తెగ ఆరాటపడ్డారు. అయితే ఆమెపై బాబాను తప్పించేందుకు కుట్రపన్నారన్న ఆరోపణలతో కేసు దాఖలవడంతో ఆమె పరారీలో ఉన్నారు.

హనీప్రీత్‌ హరియాణా దాటి వెళ్లకుండా విమానాశ్రయంలో, రాష్ట్ర సరిహద్దుల్లో తగిన హెచ్చరికలు జారీ చేసినా ఇంతవరకు ఆమె ఆచూకి వెలుగులోకి రాలేదు. హనీప్రీత్‌ తో కూడా బాబా లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని ఆమె నుంచి విడాకులు తీసుకున్న మాజీ భర్త మీడియా ముందు ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.  బాబా జైల్లోకి వచ్చిన వారం రోజులకే ఓ సైకియాట్రిస్ట్‌ సహా డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. సెక్స్‌కు బానిసైన బాబా అది లేకపోవడం వల్ల నిద్రపోలేక పోతున్నారని సైక్రియాట్రిస్ట్‌ తెలిపారు. ఇప్పటికీ గుర్మిత్‌ నిద్రలేమితో ఆందోళనకు గురవుతున్నారని జైలు సిబ్బంది తెలిపారు.

మరిన్ని వార్తలు