జాషువా జాతీయకవి

1 Dec, 2014 01:50 IST|Sakshi
  • ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
  • సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ కవి గుర్రం జాషువా కేవలం ఒక జాతికి చెందిన కవి కాదని, జాతీయ కవి అని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. జాతీయ మహాకవి గుర్రం జాషువా 119వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ భవనంలో ఆదివారం విశిష్ట సాహిత్యగోష్టి ఏర్పాటు చేశారు.

    తెలుగు సాహితి, గుర్రం జాషువా పరిశోధనా కేంద్రం, తెలుగు అకాడమీ(హైదరాబాద్), తెలుగు సాహితి ఢిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యార్లగడ్డ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నాల్కల మీద నిలిచేవాడే సుకవి అని జాషువా అన్నారని, అంతటి సుకవి అయినందునే ఆయన్ను అంతా గుర్తు చేసుకుంటున్నారన్నారు.  

    తెలుగులో గొప్ప సాహిత్యం ఉన్నా, అది హిందీలోకి అనువాదం అయితేనే దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ, కులం, మతం, సమాజం, బంధువులతో సంఘర్షణే జాషువాను కవిని చేశాయన్నారు. కులాలకతీతమైన సమసమాజమే జాషువాకు అసలైన నివాళి అన్నారు.

    దేశంలో కులపరమైన రిజర్వేషన్లు కాకుండా ఆర్థికపరమైన వెనకబాటుతనం ఆధారంగా ప్రజలను అభివృద్ధి చేసే రాజ కీయం రావాలని అభిప్రాయపడ్డారు. సభకు ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఏల్చూరి మురళీధర్‌రావు, ప్రముఖ రచయిత కాలువ మల్లయ్య, ఎంవీ లక్ష్మి, సురేఖ,  సాహితీప్రియులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు