26న ‘గురుప్రియ’ ప్రారంభం

24 Jul, 2018 12:35 IST|Sakshi
ప్రారంభం కానున్న గురుప్రియ వంతెన

మల్కన్‌గిరి/భువనేశ్వర్‌: సుమారు ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న గిరిజనుల కల నెరవేరనుంది. జిల్లాలోని చిత్రకొండ సమితి జలాశయంలో 50ఏళ్లుగా గిరిజనులు ఏ సదుపాయాలూ లేకుండా, బయట ప్రపంచం తెలియకుండా నివసిస్తున్నారు. ఆ గిరిజనులకు విద్య, వైద్య సదుపాయాలు ఇంతవరకు లేవు. అయితే ఇకపై వారు బయట ప్రపంచానికి రావాలంటే నదులు దాటాల్సిన పని లేదు.

గిరిజనుల సౌలభ్యం కోసం సుమారు రూ.200 కోట్లతో జిల్లాలోని జన్‌బాయి నదిపై నిర్మించిన గురు ప్రియ సేతును ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గురువారం ప్రారంభిస్తారు.  లోగడ ఈ నెల 18వ తేదీన గురు ప్రియ సేతును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ప్రకటించారు. కుండపోత వర్షాల కారణంతో ఈ కార్యక్రమం వాయిదా పడిన విషయం తెలిసిందే.

మల్కన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ సమితి కటాఫ్‌ ప్రాంతాల్ని అనుసంధానపరస్తూ జన్‌బాయి నదిపై 910 మీటర్ల  పొడవైన ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెన ప్రారంభంతో 151 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో అనుసంధానం ఏర్పడుతుంది. 7 పంచాయతీల్లోని దాదాపు 30 వేల మంది గ్రామస్తులు సురక్షిత రవాణా సదుపాయాలు పొందుతారు.

అలాగే అదేరోజు పర్యటనలో మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో 320 పడకలతో నిర్మించిన 7 అంతస్తుల ఆస్పత్రి భవనాన్ని కూడా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రారంభించనున్నారు. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. ఈ ఆస్పత్రి ప్రారంభమైతే ఇకపై జిల్లా నుంచి గిరిజనులు, ఇతర ప్రజలు బరంపురం, కటక్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు.

ఈ ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్, ల్యాబొరేటరీ, ఈఎన్‌టీ, దంతాలు, ప్రసూతి వార్డు విభాగాలు ఏర్పాటయ్యాయి. ఈ ఆస్పత్రికి మహిళా వైద్యులతో పాటు మరికొంత మంది వైద్యులు నియామకం కానున్నట్లు జిల్లా వైద్యాధికారులు అధికారులు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో జవాన్లు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు కావడంతో ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.  

మరిన్ని వార్తలు