‘సూపర్‌ 30 ఆనంద్‌ ఓ మోసగాడు’

22 Sep, 2018 19:18 IST|Sakshi

పిల్‌ దాఖలు చేసిన గువాహటి ఐఐటీ విద్యార్థులు

పట్నా : బిహార్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు, సూపర్‌ 30 ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకుడు ఆనంద్‌ కుమార్‌కు గువాహటి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫ్రీగా కోచింగ్‌ ఇస్తానంటూ ఈశాన్య భారతదేశ విద్యార్థులను ఆనంద్‌ కుమార్‌ మోసం చేశారంటూ ఐఐటీ గువాహటికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వీరి తరపున కోర్టుకు హాజరైన లాయర్‌ అశోక్‌ సరాఫ్‌ తన వాదనలు వినిపిస్తూ...‘ ఐఐటీ బాబాగా పేరొందిన ఆనంద్‌ కుమార్‌ ఫ్రీగా కోచింగ్‌ ఇస్తానంటూ ఈశాన్య భారతదేశ విద్యార్థులను ఆకర్షించారు. కానీ రామానుజం స్కూల్‌ ఆఫ్‌ మాథమెటిక్స్‌లో చేరిన తర్వాత వారి నుంచి 33 వేల రూపాయలు వసూలు చేశారు. అలాగే ఆయన రాంగ్‌ గైడెన్స్‌ వల్ల ఎంతో మంది ఐఐటీ ఆశావహులు చాలా నష్టపోయారని’  ఆరోపించారు. దీంతో విద్యార్థులు దాఖలు చేసిన పిల్‌పై విచారణకు హాజరు కావాలంటూ శుక్రవారం ఆనంద్‌ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది.

కాగా పట్నా కేంద్రంగా ఆనంద్‌ కుమార్‌ ‘సూపర్‌ 30’  కోచింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో ఎటువంటి లాభం ఆశించకుండా విద్యార్థులకు శిక్షణనిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 14 ఏళ్ల కిందట కుమార్‌ స్థాపించిన సూపర్‌ 30,  2010లో తొలిసారిగా వార్తల్లో నిలిచింది. ఆ ఏడాది ఐఐటీ-జేఈఈలో కుమార్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మొత్తం 30 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇది అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో ఆనంద్‌ కుమార్‌ బయోపిక్‌ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు  సూపర్‌ 30 అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు