రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమే

22 Jan, 2020 04:33 IST|Sakshi

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినవారిపై రేపటిలోగా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఇన్ని వాస్తవాలు, ఆధారాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలసి ఆయన మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

జీవీఎల్‌ మాట్లాడుతూ.. ‘రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి రాజకీయంగా మేం రాష్ట్రంలో పోరాటం చేస్తామని చెప్పాం. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేతలు అం టున్నారు. రాజ్యాంగ వ్యవస్థలో కొన్ని నిర్ణయాలను కేంద్రం, మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. శివరామకృష్ణన్‌ కమిటీ వద్దని చెప్పినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టింది.

రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి అందరూ సమర్థించారు. పెద్దన్న పాత్ర పోషించాలని కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేయడం టీడీపీ ప్రతిపక్షంగా విఫలమైందనడానికి నిదర్శనం. వేరొకరు పెద్దన్న పాత్ర పోషిస్తే టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా?’ అని మండిపడ్డారు. కన్నా మాట్లాడుతూ.. ‘మూడు రాజధానుల నిర్ణయానికి కేంద్ర మద్దతు ఉందంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం’ అని చెప్పారు.

జనసేనతో సమావేశం ‘రాజధాని’పై కాదు: పవన్‌కల్యాణ్‌తో బుధవారం జరిగే సమావేశంలో రాజధాని అంశంపై చర్చిస్తారని కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేసిన కథనాల్లో వాస్తవం లేదని జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా