రామ మందిర నిర్మాణంపై బీజేపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

7 Oct, 2019 10:29 IST|Sakshi

జైపూర్‌: అయోధ్య రామ జన్మభూమి వివాదం ఏళ్లుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజస్తాన్‌ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌చంద్‌ పరాఖ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్‌ 17నాటికి రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. పాలిలో నిర్వహించిన రామ్‌లీలా కార్యక్రమానికి జ్ఞాన్‌చంద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అయోధ్య వివాదంలో అక్టోబర్‌ 17నాటికి సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడిస్తుంది. ఆ వెంటనే మందిర నిర్మాణం పనులు ప్రారంభమవుతాయి. నవంబర్‌ 17నాటికి రామజన్మభూమిలో మందిర నిర్మాణం పూర్తవుతుంది. దాంతో ఈ ఏడాది చాలా అద్భుతంగా ముగుస్తుంది’ అన్నారు. జ్ఞాన్‌చంద్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ఏళ్లుగా నడుస్తున్న అయోధ్య స్థల వివాదం విచారణను ఈ నెల 17నాటి కల్లా ముగించేయనున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా అయోధ్య వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ జన్మభూమి వివాదంలో త్వరలోనే శుభవార్త వినబోతామని పేర్కొన్నారు. ‘మనం రాముడి భక్తులము. భక్తికి ఎంతో శక్తి ఉంది. రాముడికి సంబంధించి త్వరలోనే శుభవార్త వింటామని’ ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అయితే యోగి వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడ్డాయి. ఈ క్రమంలో అఖిలేష్‌ యాదవ్‌ కోర్టు పరిధిలో ఉన్న అంశం మీద ఎలాంటి తీర్పు రాబోతుందో యోగికి ముందే ఎలా తెలిసింది అని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు