ఎవరికి ఎక్కువ హెచ్‌1బీ వీసాలంటే....

31 Mar, 2018 16:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో హెచ్‌1 బీ వీసా సాధించిన విద్యార్థుల్లో ఎక్కడ చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారని అడిగితే ముంబైలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లేదా హైదరాబాద్‌లోని బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ అన్న సమాధానం తరచుగా వస్తుంది విద్యార్థుల నుంచి స్కాలర్ల నుంచి. ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ కార్యాలయం నుంచి సేకరించిన వివరాలను పరిశీలిస్తే అవాక్కవుతాం.

2017 సంవత్సరానికి అమెరికా మొత్తం 85 వేల హెచ్‌1 బీ వీసాలను విడుదల చేయగా, అందులో 20 వేల వీసాలు భారతీయ విద్యార్థులకు లభించాయి. వాటిలో ఏకంగా 850 వీసాలు చెన్నైలోని అన్నా యూనివర్శిటీ విద్యార్థులకు రాగా, 747 వీసాలు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్శిటీకి లభించాయి. మనం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి 63 వీసాలు రాగా, బిర్లా యూనివర్శిటీకి 61 వీసాలు వచ్చాయి.

దీనివల్ల ఎక్కువ వీసాలు వచ్చిన యూనివర్శిటీలే ఐఐటీ, ఐఐఎంలకన్నా విద్యా ప్రమాణాల్లో ముందున్నాయని అనుకుంటే పొరపాటు. ఏడాదికి ఐఐటీ విద్యార్థులు 12వేల మందికన్నా తక్కువ మంది హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే అన్నా యూనివర్శిటీ చెందిన వారు దాదాపు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు. లాటరీ ద్వారా వీసాలను ఎంపిక చేస్తారు కనుక, ఎక్కువ విద్యార్థులున్న యూనివర్శిటీకి ఎక్కువ వీసాలు లభించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఎక్కువ వీసాలు సాధించిన విద్యార్థుల జాబితాలో దేశంలోని ఐఐటీలు మొదటి 25 స్థానాలకు ఆక్రమించడం విశేషమే.

మరిన్ని వార్తలు