భీమ్‌ యాప్‌లో లోపం?

2 Jun, 2020 06:28 IST|Sakshi

కొందరు ఎథికల్‌ హ్యాకర్ల అభిప్రాయం

ముంబై: యూపీఐ ఆధారిత భీమ్‌ యాప్‌లో లోపాలున్నాయంటూ కొందరు ఎథికల్‌ హ్యాకర్లు సోమవారం ఓ వెబ్‌సైట్‌ ద్వారా హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను యాప్‌ నిర్వహణ సంస్థ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్పీసీఐ) కొట్టేసింది. 13.6 కోట్ల డౌన్‌లోడ్‌లు ఉన్న ఈ యాప్‌లో ఉన్న ఓ లోపం ద్వారా కీలక సమాచారం లీకవుతోందని హ్యాకర్లు వీపీఎన్‌ మెంటర్‌ వెబ్‌సైట్‌ ద్వారా హెచ్చరించారు. కొన్ని ప్రాథమిక భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఈ ముప్పు తప్పి ఉండేదన్నారు. భీమ్‌ మొబైల్‌ పేమెంట్‌ యాప్‌ ద్వారా భారీ స్థాయిలో వినియోగదారుల ఆర్థిక సమాచారం పబ్లిక్‌కు అందుబాటులోకి వచ్చిందన్నారు.  ప్రొఫైల్స్, లావాదేవీలు, ఆధార్, పాన్, కాస్ట్‌ సర్టిఫికెట్, రెసిడెన్స్‌ ప్రూఫ్, ఇతర ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్ల వంటి 409 జీబీల సమాచారం ప్రమాదం బారిన పడినట్లు చెప్పారు. అయితే భీమ్‌ యాప్‌ సురక్షితమేనని, ఎలాంటి సమాచారం లీక్‌ కాలేదని ఎన్పీసీఐ స్పష్టంచేసింది. 

మరిన్ని వార్తలు