హజ్‌ సబ్సిడీ రద్దు

17 Jan, 2018 03:22 IST|Sakshi

ముస్లింల సాధికారత కోసమే: కేంద్రమంత్రి నఖ్వీ

ఈ మొత్తాన్ని మైనార్టీ బాలికల విద్యకు వినియోగిస్తాం

న్యూఢిల్లీ: ఈ ఏడాది నుంచి హజ్‌ యాత్రకు సబ్సిడీ ఇవ్వబోమని కేంద్ర మైనారిటీ శాఖమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు. ‘బుజ్జగింపు రాజకీయాలు కాకుండా ముస్లింలు హుందాగా బతికేలా సాధికారత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సబ్సిడీతో ముస్లింలు ఎలాంటి లబ్ధి పొందటం లేదు. గౌరవంతో కూడిన అభివృద్ధినే మేం విశ్వసిస్తాం. ఇప్పటివరకూ హజ్‌యాత్రకు కేటాయిస్తున్న మొత్తాన్ని మైనారిటీ బాలికల చదువుకు వినియోగిస్తాం’ అని మంగళవారం మీడియాకు వెల్లడించారు.

సౌదీ అరేబియాలోని మక్కాకు దేశం నుంచి ఏటా 1.75 లక్షల మంది ముస్లింలు వెళ్తుంటారని నఖ్వీ తెలిపారు. గతేడాది హజ్‌ సబ్సిడీ కింద రూ.250 కోట్లకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. సబ్సిడీ రద్దు వల్ల హజ్‌ ఖర్చులు పెరిగిపోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 నాటికి హజ్‌ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలంటూ సుప్రీం కోర్టు 2012లో ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సబ్సిడీలో భాగం గా ప్రభుత్వరంగ విమానయాన సంస్థల్లో టికెట్‌ ధరలపై రాయితీ ఇస్తున్నారు.

అదనపు భారమేం ఉండదు
సాక్షి, హైదరాబాద్‌: హజ్‌ సబ్సిడీని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లేవారిపై ఎలాంటి అదనపు భారం పడదని హజ్‌ కమిటీ ఉన్నతాధికారులు తెలిపారు. హజ్‌ యాత్రకు విమానయాన టికెట్లపై కేంద్ర హజ్‌ కమిటీ నిర్ణయించిన స్లాబ్‌ రేటుకు, విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న మొత్తానికి భారీ వ్యత్యాసం లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. గతేడాది హజ్‌ యాత్రికులకు కమిటీ స్లాబ్‌ రేటును రూ.65 వేలుగా నిర్ధారించగా, విమానయాన సంస్థలు రూ.62,065 మాత్రమే వసూలు చేశాయన్నారు. సాధారణంగా ఇప్పటివరకూ స్లాబ్‌ రేటు కన్నా ఎక్కువ మొత్తాన్ని విమానయాన సంస్థలు వసూలు చేస్తే.. ఆ మొత్తాన్ని సబ్సిడీగా కేంద్రం హజ్‌ కమిటీకి అందజేస్తుంది.

>
మరిన్ని వార్తలు