తప్పు నాదే..ఎవరినీ నిందించొద్దు : హమీద్‌ అన్సారీ

20 Dec, 2018 15:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయి గత ఆరేళ్లుగా పాకిస్తాన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారతీయుడు హమీద్‌ నిహాల్‌ అన్సారీ మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాఘా- అట్టారీ సరిహద్దు గుండా భారత్‌ చేరిన హమీద్‌ తల్లిదండ్రులను కలుసుకున్నాడు. అనంతరం తాను విడుదలయ్యేందుకు సహాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ‘ సుష్మాజీ నన్ను తన కొడుకులా భావించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నిజంగా ఆమె భరతమాత కంటే తక్కువేమీ కాదు. యువతను సన్మార్గంలో నడిపించే మాతృమూర్తి’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

తప్పు నాదే...
‘ప్రస్తుతం నేను నా ఇంటికి తిరిగి వచ్చాను. నా వాళ్ల మధ్య.. స్వదేశంలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. పాక్‌ జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కూడా నాకు ఇంత గొప్ప స్వాగతం లభిస్తుందనుకోలేదు. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా బాధను ప్రపంచానికి పరిచయం చేసిన మీడియాకు రుణపడి ఉంటాను. అయితే ఈ విషయంలో తప్పంతా నాదే. నేను ఎవరినీ నిందించాలనుకోవడం లేదు. నా ఉద్దేశం సరైందే. కానీ దానిని అమలు చేసిన విధానంలోనే పొరపాటు జరిగింది. అందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది’ అని హమీద్‌ వ్యాఖ్యానించాడు.

కాగా ముంబైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే హమీద్‌ ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ మహిళను ప్రేమించాడు. ఆమె కోసం 2012లో అప్ఘనిస్తాన్‌ మీదుగా పాక్‌ వెళ్లాడు. సరిహద్దు నుంచి అక్రమంగా ప్రవేశించిన భారత గూఢచారిగా భావించిన పాక్‌ నిఘా సంస్థలు అతడిని అరెస్ట్‌ చేశాయి.  ఈ క్రమంలో ఫేక్‌ ఐడెంటిటీ కార్డు ఉందన్న కారణంతో హమీద్‌కు పాక్‌ మిలటరీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడిని పెషావర్‌ జైలుకు తరలించారు. 2018 డిసెంబర్‌ 15 నాటికి హమీద్‌కు విధించిన శిక్ష పూర్తయింది. కానీ అతడికి సంబంధించిన లీగల్‌ డాక్యుమెంట్లు లేకపోవడంతో పాక్‌ అతడిని వదిలేయలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెషావర్‌ హైకోర్టు.. శిక్ష పూర్తయినా వ్యక్తిని జైళ్లో ఎందుకు ఉంచారని,  అతడిని వెంటనే స్వదేశానికి పంపాలని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు