ఠాక్రేపై గౌరవముంటే విడిపోయేవారా?

6 Oct, 2014 22:03 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ధ్వజమెత్తారు. 25 ఏళ్ల అనుబంధం తెగిపోతున్న సమయంలో బాల్‌ఠాక్రేపై ఉన్న గౌరవం, ప్రేమాభిమానాలు గుర్తుకురాలేదా..? అని మోడీని నిలదీశారు. శివసేనపై విమర్శలు చేయనని, ఇలా దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రేకు నివాళులు అర్పిస్తున్నాని మోడీ ఆదివారం ముంబైలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఉద్ధవ్.. సామ్నా సంపాదకీయం ద్వారా  తనదైన శైలిలో మోడీపై మండిపడ్డారు.

 ‘బాల్‌ఠాక్రే పై మోడీకి గౌరవం ఉండడం మంచిదే. ఇందుకు మేము ఆయనకు స్వాగతం పలుకుతాం. మేం కూడా మోడీని గౌరవిస్తాం. అయితే హిందుత్వం అనే గట్టిదారంతో ఏర్పడిన బంధాన్ని శివసేన అధినేత బాల్‌ఠాక్రే 25 ఏళ్లు కొనసాగించారు. ఆ బంధం ఇప్పుడెలా తెగిపోయింద’ని ప్రశ్నించారు. సీట్ల పంపకాల విషయంపై ముందుకువచ్చి బంధం తెగకుండా చూసినట్లయితే బాల్‌ఠాక్రేకు అది నిజమైన నివాళి అయ్యేదంటూ చురకలంటించారు.

 రాష్ట్ర ప్రజలు తెలివైనవారేనని, వారందరికీ అసలు దొంగలెవరు..? బురఖాలో ఉన్న దొంగలెవరో..? అనేది తెలుసునంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి మహారాష్ట్రను దోచుకున్నాయని ఆరోపించారు. ‘ఇటీవలే గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబేన్ పటేల్ ముంబైకి ఏ ఉద్దేశంతో వచ్చివెళ్లారో తెలిసిందే. ముంబైలోని పారిశ్రామికవేత్తలను మహారాష్ట్రలో ఉండవద్దని, అందరు గుజరాత్‌కు తరలిరావాలని ఆనందీబేన్ పిలుపునిచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇలా చేయడం కూడా మహారాష్ట్రను దోచుకోవడమే అవుతుంద’ని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు.

‘మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన బెల్గావ్, కారవార్ తదితర ప్రాంతాలపై మోడీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్‌ల అభిప్రాయాలేమిటి..? సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 20 లక్షలమంది మరాఠీలపై జరుగుతున్న అన్యాయంపై వైఖరేమిటి? ఛత్రపతి శివాజీ మహారాజు ఆశీర్వాదాలున్నాయంటు మహారాష్ట్రలోకి వచ్చిన వారు సరిహద్దు అంశంపై ఎందుకు మాట్లాడడంలేదు? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది.

 మోడీ ప్రధానిగా ఉన్నారు. కాని యెల్లూర్‌లో మరాఠీ ప్రజలకు దారుణంగా అన్యాయం జరుగతోంది. ఇలాంటి సమయంలో మరాఠీ ఎంపీలు ఢిల్లీలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మహారాష్ట్రను ముక్కలు చేయాలన్న కలతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింద’ని ఆరోపించారు.  

 తుల్జాపూర్‌లో ఆవేశంగా..
 శివసేన, బీజేపీల బంధం తెగిపోవాలనేది మాతా తుల్జభవాని నిర్ణయం కావొచ్చని, అందుకే బంధం తెగిపోయిందని శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. తుల్జాపూర్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన తనదైన శైలిలో కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు బీజేపీపై విమర్శలు గుిప్పించారు.

 గోపీనాథ్ ముండే ఉండి ఉంటే కూటమి ముక్కలయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. అధికారం చేజిక్కించుకునేందుకు అందరు ప్రచార బరిలోకి దిగారని, ప్రధాని, హోంమంత్రి, కేంద్రమంత్రులు అనేక హామీల వర్షం కురిపిస్తున్నారన్నారు. ‘అధికారం మాకివ్వండి.. మాకివ్వండి.. మేము రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేస్తామో చూడండ’ని అంటున్నారంటూ ఎద్దేవా చేశారు.

 సీట్ల పంపకాలపై మాట్లాడుతూ ... ‘అసెంబ్లీపై కాషాయం రెపరెపలాడాలంటే తుల్జాపూర్‌లో కూడా కాషాయం రావాలని కార్యకర్తలు చెప్పారు. అయితే ఈ సీటు బీజేపీకి వెళ్లితే ఎలా అని కొందరు ప్రశ్నించారు. అదే సమయంలో బంధం తెగిపోయిందని వార్త వచ్చింది. దీన్నిబట్టి నీకు నిండుగా ఇస్తానని చెబుతుండగా కూటమిలో ఏముందని తుల్జాభవాని నాకు సంకేతాలిచ్చినట్టయింది. అలా బీజేపీ, శివసేన కూటమి తెగిపోవాలని మాతా  తుల్జాభవాని నిర్ణయించిందని నాకు అనిపిస్తోందన్నారు.

 తుల్జాపూర్‌తోపాటు రాష్ట్ర అభివృద్ధి విషయంపై ఎవరూ శ్రద్ధ వహించలేదు. కానిమేము రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇందుకోసం అన్ని ప్రణాళికలు మావద్ద సిద్ధంగా ఉన్నాయి. అయితే మాకు అధికారం ఇవ్వాలా..? వద్దా..? అనే విషయాన్ని మీరే నిర్ణయించుకోండ’ంటూ ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు